దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో ఒడిషా, బెంగాల్ మినహా అన్ని చోట్లా ఎన్నికలను వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. కేంద్ర ఎన్నికలసంఘం ఉపఎన్నికల నిర్వహణ అంశంపై ఇటీవల అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వాల అభిప్రాయాలను సేకరించింది. ఈ మేరకు తెలంగాణ , ఏపీ ప్రభుత్వాలు ఎన్నికలు ఇప్పుడే వద్దని కోరాయి. పండగ సీజన్ అయిపోయాక నిర్వహించాలని కోరాయి. ఒడిషా, బెంగాల్ మినహా మిగిలిన ప్రభుత్వాల్నీ అలాగే కోరడంతో ఎన్నికలు నిర్వహించాలని కోరిన రాష్ట్రాల్లో మాత్రమే ఉపఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
హుజురాబాద్ ఉపఎన్నికలు నేడో రేపో అన్నట్లుగా పార్టీలు పోటీ పడుతున్నాయి. ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధంగా లేదని తేలిపోయింది. ఎంత ఆలస్యం అయితే ఈటల అంత బలహీనపడతారన్న అంచనాతో వాయిదాను కోరుకున్నట్లుగా తెలుస్తోంది. పండగ సీజన్ అంటే… ఇక సంక్రాంతి వరకూ ఏదో ఓ పండుగ వస్తూనే ఉంటుంది. అంటే ఉప ఎన్నికలు ఇక జనవరి తర్వాతే జరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఇప్పటికిప్పుడు వాయిదా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మరో మూడు, నాలుగు నెలల వరకూ రివ్యూ చేసే అవకాశం లేదు. అందుకే హుజురాబాద్ ఉపఎన్నిక కూడా ఇప్పుడల్లా జరిగే అవకాశం లేదని అనుకోవచ్చు. బద్వేలు ఉపఎన్నిక కూడా అంతే. చంద్రబాబు నిన్ననే టీడీపీ అభ్యర్థిని ఖరారు చేశారు. కానీ ప్రభుత్వం ఎందుకో ఎన్నికల నిర్వహణకు సిద్ధపడలేదు.
ఒడిషా , బెంగాల్ సర్కార్ కూడా తమ రాష్ట్రాల్లో కోవిడ్ పూర్తిగా కంట్రోల్లో ఉందని ఉపఎన్నికలు పెట్టాలని కోరాయి. అలాగే వరదల ప్రభావం కూడా ఉపఎన్నికలు జరిగే ప్రాంతాలపై ఉండదని స్పష్టం చేశాయి. అదే సమయంలో బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేకమైన కారణాలను చెప్పింది. తమ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరు నెలల్లోపు అసెంబ్లీకి ఎన్నిక కాకపోతే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపఎన్నికలు నిర్వహించాలని కోరింది. బెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికను నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో బెంగాల్ సీఎంకు ఓ పెద్ద టెన్షన్ తీరిపోయింది.