నాగార్జున సాగర్, తిరుపతి ఉపఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయలేదు. ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తామని సునీల్ అరోరా ప్రకటించారు. ఉపఎన్నిలకు షెడ్యూల్ ప్రకటించకపోయినా… మొత్తంగా ఎనిమిది విడతలుగా జరగనున్న ఎన్నికల్లో ఏదో ఓ దశలో ఉపఎన్నికలు ఖాయమని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎప్పుడైనా ప్రత్యేక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కేంద్ర పాలిత రాష్ట్రం పుదుచ్చేరితో పాటు బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఏప్రిలో ఆరో తేదీన ఒకే విడత ఎన్నికలు పూర్తవుతాయి.
అసోంలో మాత్రం మూడు విడుతలు, బెంగాల్లో 234 స్థానాల కోసం ఏకంగా ఎనిమిది విడుతలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. మే రెండో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో అసోంలో మాత్రమే బీజేపీ అధికారంలో ఉంది. బెంగాల్లో అధికారం కోసం పోటీ పడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పెద్దగా ఉనికిలో లేదు. బీజేపీ పోటీ పడుతున్న రెండు రాష్ట్రాల్లో సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ ఉండగా.. దక్షిణాదిలో మాత్రం.. పెద్ద రాష్ట్రం అయినప్పటికీ తమిళనాడులోనూ ఒకే విడతలో పూర్తి చేస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని తెలియగానే… తమిళనాడు సర్కార్ మరో ఆఫర్ ప్రజలకు వదిలింది. బంగారం రుణాలను మాఫీ చేస్తూ పళని స్వామి ఉత్తర్వులు జారీ చేశారు. మరో వైపు బెంగాల్లో ఎనిమిది విడుతల ఎన్నికలు పెట్టడంపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. బీజేపీ షెడ్యూల్ తయారు చేసినట్లుగా ఉందన్నారు. మొత్తానికి దేశంలో మరోసారి ఎన్నికల మూడ్ ప్రారంభమయింది. మే రెండో తేదీ వరకూ రాజకీయ హడావుడికి కొరతేం ఉండదు.