తెలంగాణలో నంద్యాల తరహా ఉప ఎన్నిక ప్రయోగం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు సిద్ధపడ్డట్టే కనిపిస్తోంది. రాష్ట్రంలో ఏదో ఒక స్థానానికి ఉప ఎన్నిక నిర్వహిస్తే, అధికార పార్టీ పట్ల ప్రజల నాడి ఏవిధంగా ఉందనే స్పష్టమైన అంచనా వస్తుందని సీఎం ఆలోచిస్తున్నారన్నట్టుగా ఇటీవలే కథనాలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా పరిణామాలు ఒక్కోటిగా చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంటు సభ్యుడు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డితో రాజీనామాకు రంగం సిద్ధమైపోయింది. ఆయన కూడా మంత్రి పదవి ఆశించే తెరాసలోకి చేరిన సంగతి వాస్తవమే. అయితే, సరైన సందర్భమూ అవకాశమూ రాకపోవడంతో గుత్తాకి ఎలాంటి పదవినీ కేసీఆర్ ఇవ్వలేకపోయారు. దీంతో ఇప్పుడు రైతు సేవా సమితుల రాష్ట్ర కో ఆర్డినేటర్ పదవి ఇవ్వబోతున్నారట. దీనికి క్యాబినెట్ హోదా కూడా కల్పించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
నిజానికి, ఈ పదవి ఇచ్చినంత మాత్రాన రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరమైతే సాంకేతికంగా లేదు. కానీ, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఉప ఎన్నిక ఏ విధంగా అయితే ఒక కొత్త ఊపు తీసుకొచ్చిందో, అదే ఊపు తెరాసకు రావాలంటే ఇలాంటి ప్రయోగం చేయాలని సీఎం డిసైడ్ అయినట్టు సమాచారం. దానికి అనుగుణంగానే త్వరలోనే గుత్తా రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఇదే విషయాన్ని గుత్తా ముందు ప్రశ్నిస్తే… దానికి ఇంకా సమయం ఉందనీ, అలాంటి నిర్ణయాలేవీ ఇప్పుడు తీసుకోలేదనీ, ముందుగా జరగాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయంటూ ఆయన చెప్తున్నారు.
స్థానికంగా చూసుకుంటే.. ఇప్పటికే నల్గొండ లోక్ సభ స్థానం పరిధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సర్వే నిర్వహించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడే ఎన్నికలకు వెళ్తే తెరాసకు 57 శాతం ఓట్లు వస్తాయనీ, తరువాతి స్థానంలో కాంగ్రెస్ పార్టీకి 27 శాతం వస్తాయని ఆ నివేదికలో తేలింది. అంటే, తెరాసకు తిరుగులేని మెజారిటీ ఖాయం అన్నదే ఆ సర్వే ఫలితం. పరిస్థితి ఇంత పాజిటివ్ ఉంటున్నప్పుడు ఎన్నిక ఎందుకు ఖర్చు దండగ అనిపిస్తుంది! అయినా, నంద్యాలలో ఉప ఎన్నిక ఏదో ప్రయోగం కోసం ఏపీ సీఎం చంద్రబాబు జరిపించలేదు కదా. భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే పదవిలో ఉంటుండగా మరణించారు. దాంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. ఉప ఎన్నిక అనివార్యమైంది. కానీ, ఇలా బలవంతంగా రాజీనామా చేయించి మరీ ఎన్నికలకు వెళ్లడం ఏంటో అర్థం కావడం లేదు! ఏదేమైనా, దసరా నవరాత్రులు ప్రారంభం అయిన వెంటనే ఈ ప్రయోగాత్మక ఎన్నికపై మరింత స్పష్టత రావడం ఖాయమని తెరాస వర్గాలు అంటున్నాయి.