మొన్న ల్యాప్ ట్యాప్ ఇస్తామని చెప్పారు. ఓ సభలో మోడల్ ల్యాప్ ట్యాప్‌ను జగన్ చూపించారు కూడా. తర్వాత ట్యాబ్ అన్నారు. ఈ మోడల్ ట్యాబ్‌ను చూపించలేదు. కానీ ఇప్పుడు ఏపీలోని నాలుగు నుంచి పదో తరగతి వరకూ ఉన్న ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు ఎవరి ఫోన్ వారు తెచ్చుకోవాలని ఆదేశించారు. అందులోనే బైజూస్ పాఠాలు చెబుతారట. పిల్లల ఫోన్లలో యాప్ ఇన్ స్టాల్ చేయాలని అధికారికంగా ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలు చూసి బిత్తరపోవడం టీచర్లు, విద్యార్థుల వంతు అయింది.
బైజూస్‌కు రూ. ఐదు వందల కోట్లు కట్టి మరీ ట్యాబ్‌లు తెప్పిస్తున్నామని.. సెప్టెంబర్ నుంచే అందరికీ ఇస్తామని చెప్పారు. కానీ ట్యాబ్‌లు రాలేదు. ఇప్పుడు ట్యాబ్‌ల గురించి మాట్లాడటం లేదు సరి కదా విద్యార్థులే ఫోన్లు తెచ్చుకోవాలంటున్నారు. నాలుగో తరగతి నుంచి పదో తరగతి పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చి.. డేటా మెయిన్ టెయిన్ చేసేంత స్థోమత ఉంటే.. ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకోమా అనే అభిప్రాయం ముక్తకంఠంతో వినిపిస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివేవారంతా నిరుపేదలే. ఎవరైనా చేర్పిస్తే ఆదర్శం అని మీడియాలోనే హడావుడి చేస్తారు. అలాంటి పరిస్థితులోని ప్రభుత్వ విద్యా వ్యవస్థ దిగజారిపోయింది.
ఈ పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది ఏపీ సర్కార్. అసలు టీచర్లు చెప్పే పాఠాలుండగా.. బైజూస్ .. ఆన్ లైన్ పాఠాలు ఎందుకో ఎవరికీ తెలియదు. బైజూస్ పాఠాల వల్ల ప్రయోజనమే లేదని.. చదవేస్తే ఉన్న మతి పోతోందన్నట్లుగా ఉందని.. ఆ సంస్థకు బోలెడంత పేరు ఉంది. ఓ వైపు ప్రభుత్వ టీచర్లను పెట్టుకుని మరో వైపు ఇలా ఎందుకు చేస్తున్నారన్నది అర్థం కాని విషయం. మొత్తంగా చూస్తే ట్యూబ్‌లు ఇవ్వకుండా బైజూస్ చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోందని.. అయితే ఆ సంస్థకు రూ. ఐదు వందల కోట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు కాబట్టి విద్యార్థుల మీద భారం వేస్తున్నారని అంటున్నారు.