దేశంలో ప్రముఖ ఎడ్యూటెక్ కంపెనీ బైజూస్ తీవ్ర వివాదాల్లో ఇరుక్కుంటూనే ఉంది. తాజాగా ఆ సంస్థ సీఈవో రవీంద్రవన్కు ఎన్సీపీసీఆర్ సమన్లు జారీ చేసింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ సమన్లు జారీ చేసింది. తమ కోర్సు మెటీరియల్స్ కొనుగోలు చేసేందుకు పేరెంట్స్, చిన్నారులపై వత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్సీపీసీఆర్ పేర్కొన్నది. బైజూస్ తమను బెదిరించి, మోసం చేసి పిల్లల కోర్సు మెటీరియల్‌ను అమ్ముతున్నట్లు ఆ కథనంలో ఆరోపణలు చేశారు.
రుణ ఒప్పందం కుదుర్చుకుని పేరెంట్స్‌ను ఇబ్బందిపెడుతున్నట్లు బైజూస్‌పై ఫిర్యాదులు అందాయి. బైజూస్‌లో జరుగుతున్న అక్రమాల గురించి వివరణ ఇవ్వాలని, నేరుగా తమ విచారణ కమిటీ ముందు హాజరుకావాలని ఎన్సీపీసీఆర్ తన నోటీసుల్లో పేర్కొన్నది. 23వ తేదీన రవీంద్రన్ విచారణకు హాజరుకావాల్సి ఉంది. బైజూస్ వ్యవహారాలు ఇటీవలి కాలంలో తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. టర్నోవర్ కన్నా రెట్టింపు నష్టాలను.. బై జూస్ గత ఏడాది చూపించింది. నాలుగున్నరవేల కోట్ల నష్టాన్ని ప్రకటించింది. మరో వైపు ఉద్యోగులను వేల సంఖ్యలో తొలగిస్తోంది.
కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాసులకు డిమాండ్ పెరగడంతో బైజూస్ కు పెద్ద ఎత్తున ఖాతాదారులు వచ్చారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బైజూస్ పూర్తిగా మోసమని.. ఏ మాత్రం విద్యార్థులకు ఉపయోగం ఉండదని తేలిపోవడంతో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఈఎంఐల పేరుతో.. వివిధ స్కీముల పేరుతో వారిని ఖాతాదారులుగా చేర్చుకునే మోసపూరిత ప్రక్రియకు బైజూస్ పాల్పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంస్థపై వరుసగా వస్తున్న వివాదాల్లో ఇదొకటి. సోషల్ మీడియాలో బైజూస్ కంటెంట్ కొన్న ఖాతాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెట్టే పోస్టులు పెద్ద సంఖ్యలో ఉంటాయి.