స్టార్టప్ ప్రపంచంలో బైజూస్ ఓ సూపర్ స్టార్ లాంటిది. సింపుల్‌గా ప్రారంభమైన వేల కోట్లకు విస్తరించింది. ఎంత వేగంగా విస్తరించిందో అంతే వేగంగా పడిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ సంస్థ ఓనర్లు తమ కంపెనీ విలువను పెంచుకోవడానికి అడ్డగోలుగా ఇన్వెస్ట్ మెంట్ లెక్కలు చెప్పినట్లుగా ఆరోపణలు ప్రారంభమయ్యాయి. ఆ సంస్థకు విదేశాల్లోని కంపెనీల నుంచి వచ్చిన రూ. రెండు వేల కోట్లకుపైగా నిధులు అడ్రస్ లేవు. కంపెనీ యజమానులు దారి మళ్లించారా.. అసలు పెట్టుబడులు రాకుండానే వచ్చినట్లుగా చెప్పుకున్నారా అన్నది తేలాల్సి ఉంది.
మరో వైపు బైజూస్ చెల్లింపుల సంక్షోభంలో ఇరుక్కుంది. తమ స్టార్టప్ ను బలోపేతం చేసుకోడం కోసం మరో పదకొండు స్టార్టప్‌లను బైజూస్ వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. వాటికి సంబంధించిన చెల్లింపులు పెద్ద ఎత్తున చేయాల్సి ఉంది. ఆకాష్ పేరుతో ఉన్న విద్యా సంస్థలను కూడా పెద్ద మొత్తానికి కొనుగోలు చేసింది. వాటి చెల్లింపులకు నిధుల కోసం బైజూస్ తంటాలు పడుతోంది. ఆగస్టులోగా అమెరికా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్లాక్ స్టోన్‌కు 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం కంపెనీ వద్ద లేవని చెబుతున్నారు. ఓ వైపు సంస్థలోకి వచ్చినట్లుగా చెబుతున్న పెట్టుబడులు కనిపించడం లేదు..మరో వైపు చెల్లింపుల సంక్షోభం వెంటాడుతోంది.
బైజూస్ దేశంలో నెంబర్ వన్ ఎడ్యుటేక్ కంపెనీ. లాక్ డౌన్ సమయంలో భారీగా కస్టమర్లు పెరగడంతో లాభపడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడటంతో చాలా మంది రెన్యూవల్ చేసుకోవడం లేదు. పిల్లల్ని స్కూళ్లకు పంపిస్తున్నారు. దీంతో ఆదాయం పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ కారణంగా పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం రూ. ఐదు వందల కోట్లుతో ట్యాబ్‌లు కొంటామని ఆఫర్ ఇచ్చింది. ఈ డీల్ బైజూస్‌ను ఆదుకుంటుందేమో చూడాలి. లేకపోతే.. స్నాప్ డీల్లాగా బైజూస్.. అత్యంత విలువైన కంపెనీ నుంచి ఎలాంటి విలువ లేని కంపెనీగా మారినా ఆశ్చర్యం లేదు. టెక్ స్టార్టప్ ఫౌండర్ల అతి తెలివి తేటలతో మునిగిపోతున్నవి ఎన్నో. బైజూస్ కూడా అదే దారిలో నడుస్తోంది.