దేశంలో ప్రముఖ ఎడ్యూటెక్ కంపెనీ బైజూస్ ఆఫీసులు ఖాళీ చేస్తోంది. ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయి ఉద్యోగుల పీఎఫ్ కూడా చెల్లించలేని స్థితికి వెళ్లిపోయిన ఆ సంస్థ… ఆదాయ, వ్యయాల వివరాలను వెల్లడించడం లేదు. ఆ సంస్థపై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో దర్యాప్తు చేయించాలన్న ఆలోచన చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో బైజూస్.. ఆఫీసుల్ని ఖాళీ చేస్తోంది.
బెంగళూరులో బైజూస్ కు ఉన్న కార్యాలయాలన్నీ దాదాపుగా ఖాళీ అయ్యాయి. బెంగళూరులో బైజూస్‌కు మూడు ఆఫీసులు ఉన్నాయి. వీటన్నింటినీ ఖాళీ చేసింది. ఉద్యోగుల్ని ఇప్పటికే వేల సంఖ్యలో తొలగించింది. అందుకే ఆయా ఆఫీసుల్లో ఉద్యోగులు కూడా పెద్దగా ఎవరూ లేరు. ఉన్న వారిని కూడా తొలగించడానికి.. వర్క్ ఫ్రం హోం అనో.. మరో చోటికి అనో పంపేశారు. ఇప్పుడు బెంగళూరులో బైజూస్‌కు ప్రధాన కార్యాలయం మాత్రమే ఉంది.
తీవ్రమైన కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు బయటపడటంతో కంపెనీ విశ్వసనీయత తగ్గిపోతోంది. ఇటీవల బోర్డు నుంచి ఆడిటర్ డెలాయిట్ తో పాటు ముగ్గురు బోర్డు సభ్యుల రాజీనామా చేశారు. ఇప్పటికే FY21 ఆర్థిక ఫలితాలను దాఖలు చేయడంలో 18 నెలల జాప్యం జరిగింది. ఇది ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచుతోంది. పెట్టుబడిదారుల నుండి సుమారు $5 బిలియన్ల నిధులను సేకరించిన బైజూ తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు పుడుతోంది. కంపనీ విలువ $22 బిలియన్ల నుండి $5.1 బిలియన్లకు తగ్గిపోయింది.