ఒక్క సారిగా ఆకాశానికి ఎదిగి.. తర్వాత పాతాళానికి పడిపోయిన బైజూస్ ఎడ్యూటెక్ స్టార్టప్ కంపెనీ బైజూస్ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితికి చేరుకుంది. జనవరి నెల జీతాలు ఇవ్వకపోడంతో దుమారం రేగింది. దీంతో ఉద్యోగులకు జీతాలు జమ చేసిన యజమాని రవీంద్రన్.. ఉద్యోగులకు లేఖ రాశారు. ఎంతగానో పోరాడి ఈ సారి ఉద్యోగులకు జీతాలు చెల్లించినట్లు పేర్కొన్నారు. జీతాలు చెల్లించేందుకు గత కొన్ని నెలలుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. న్యాయంగా చట్టబద్ధమైన వేతనాన్ని పొందేందుకు ఈ సారి నేను మరింత ఎక్కువగా పోరాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ త్యాగాలు చేశారు.
ఎన్నడూ లేనివిధంగా ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ యుద్ధంలో అందరూ అలసిపోయారని నిర్వేదం వ్యక్తం చేశారు. కష్టసమయంలో కంపెనీకి మద్దతుగా ఉన్నందుకు, జీతాల కోసం ఓపికతో ఎదురుచూసినందుకు ఉద్యోగులకు ఈ సందర్భంగా రవీంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు. నిజానికి బైజూస్ లో ఉద్యోగుల్ని దాదాపుగా ఎనభై శాతం వరకూ సాగనంపారు. కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వారికీ జీతాలు ఇవ్వలేకపోతున్నారు.
మరో వైపు కంపెనీ విలువ 80 శాతం తగ్గిపోయింది. అప్పులు చెల్లించలేక డీఫాల్ట్ అయ్యారు. ఏపీ సర్కార్ ఇటీవలికాలంలో పెద్ద ఎత్తున ఇచ్చిన కాంట్రాక్టులతోనే ఆ సంస్థ ఇప్పటి వరకు మనుగడ సాగించిందని.. లేకపోతే దివాలా తీసి ఉండేదన్న వాదన వినిపిస్తోంది.