దేశంలో టాప్ ఎడ్యూటెక్ కంపెనీ బైజూస్ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. అమ్మకాలు రెండున్నర వేల కోట్లు ఉంటే.. నష్టాలు నాలుగున్నర వేల కోట్లుగా ప్రకటించిన ఆ సంస్థ ఇప్పుడు బయటపడటానికి ఉద్యోగుల్ని తొలగిస్తోంది. వచ్చే ఆరు నెలల్లో రెండున్నర వేల మందికి ఉద్వాసన పలకాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని నేరుగానే ప్రకటించింది. అయితే ఇప్పటికే ఆ సంస్థను కొన్ని వేల మంది వదిలేశారన్న ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా అనేక మంది టీచర్లతో ఒప్పందం చేసుకుందని వారిలో చాలా మంది గుడ్ బై చెప్పారు.
ఇప్పుడు ఇతర విభాగాల్లోనూ మ్యాన్ పవర్‌కు ఉద్వాసన పలుకుతున్నారు. లాభాల బాట పట్టడానికే ఈ చర్య అని కంపెనీ చెబుతోంది. కానీ ఉద్యోగులను తగ్గిస్తే లాభాలు ఎలా వస్తాయని ఇండస్ట్రీ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను తగ్గిస్తే ప్రొడక్టివిటీ తగ్గుతుంది.. అదే తగ్గితే అమ్మకాలు..ఆదాయం కూడా పడిపోతాయి. అలాంటప్పుడు లాభాలు ఎలా వస్తాయన్నది ప్రధాన సందేహం ఆ సంస్థ బయటకు చెప్పడం లేదు కానీ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని..బయటపడే మార్గాల కోసం అన్వేషిస్తోందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈ సంస్థ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ. ఐదు వందల కోట్ల డీల్ ఇంత వరకూ నెరవేర్చలేదు. సెప్టెంబర్‌లో పిల్లలందరికీ ట్యాబ్‌లు ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకూ పంపిణీ చేయలేదు. అక్టోబర్..నవంబర్ అని వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఈ సంస్థ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక టఎడ్యూటెక్ మార్కెట్లో గందరగోళం ఏర్పడుతోంది.