బైజూస్ నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దిగ్గజాలతో పోటీ పడి మరీ తాము టీమిండియా జెర్సీపై పేరును స్పాన్సర్ చేసుకున్న బైజూస్ ఇప్పుడు డబ్బులు కట్టడానికి నిరాకరిస్తోంది. తమ దగ్గర డబ్బుల్లేవని.. డిస్కౌంట్ ఇవ్వాలని నస పెడుతోంది. దీంతో బీసీసీఐ .. బేరాల్లేవని చెప్పి.. ఒప్పందం సమయంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం బైజూస్‌పై చర్యలు తీసుకునేందురు రంగం సిద్దం చేసుకుంది. ఇక ఒప్పందం సమయంలో రూ. 140 కోట్ల బ్యాంక్ గ్యారంటీని బైజూస్ సమర్పించింది. దాన్ని ఎన్ క్యాష్ చేసుకోవాలని బీసీసీఐ నిర్ణయించినట్లుగా కనిపిస్తోంది.
చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో వైదొలగడంతో 2019లో బైజూస్.. టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ షిప్ ను పెద్ద మొత్తంలో బిడ్ వేసి దక్కించుకుంది. దాదాపుగా ఏడాదికి రెండు వందల కోట్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఒక ఏడాది చెల్లించింది. రెండో ఏడాది రెన్యూవల్ చేసుకుంది కానీ.. డబ్బులు చెల్లించలేదు. ఇప్పుడు తాము ఇచ్చిన బ్యాంక్ గ్యారంటీని ఎన్ క్యాష్ చేసుకున్నా పర్వాలేదని.. ఇక తమకు స్పాన్సర్ షిప్ కొనసాగించే ఉద్దేశం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. అయితే ప్రస్తుత అగ్రిమెంట్ ఈ ఏడాది మార్చి వరకైనా కొనసాగాలని బీసీసీఐ కోరుతోంది. కానీ డబ్బుల్లేవని బైజూస్ వెనుకడుగు వేస్తోంది.
ఎడ్యూటెక్ కంపెనీగా బైజూస్ ఒక్క సారిగా ఎదిగింది. కానీ ఇటీవల ఆ కంపెనీ వేల కోట్ల నష్టాల్లోకి జారిపోయింది. అకౌంటింగ్ ఫ్రాడ్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఓ వైపు బైజూస్ బిజినెస్ మొత్తం పడిపోయింది. ఈ క్రమంలో ఆ కంపెనీపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు బీసీసీఐ స్పాన్సర్ షిప్ కూ గండి కొట్టేసింది.