తెలంగాణాలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జగన్ చేయబోయే నిరాహార దీక్షపై రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చాలా ఆశ్చర్యకరమయిన వ్యాక్యలు చేసారు. “జగన్మోహన్ రెడ్డి చేయబోయే దీక్ష వలన సీమకు ఇంకా చాలా నష్టం జరుగుతుంది. సీమలో జిల్లాలు తెలంగాణా నుంచి విడుదలయ్యే నీళ్ళపైనే ఆధారపడున్నాయి. అటువంటప్పుడు తెలంగాణా ప్రభుత్వంతో గొడవ పెట్టుకొంటే ఎవరికీ నష్టం? సీమకే కదా? ఈ విషయం జగన్ కి తెలియదనుకోలేము. కానీ రాయలసీమకు చెందిన ఆయన కోస్తా ఆంధ్ర ప్రాంత ప్రజలను, నేతలను ప్రసన్నం చేసుకొనేందుకు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణా ప్రభుత్వంతో మాట్లాడి సామరస్యంగా ఈ నీటి సమస్యలని పరిష్కరించుకోవాలి తప్ప వారితో కయ్యానికి కాలు దువ్వడం సరికాదు. వారి వలన సీమకు నష్టం ఏర్పడితే సహించబోము,” అని హెచ్చరించారు.
జగన్ దీక్ష గురించి ప్రకటించగానే మళ్ళీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎగువనున్న రాష్ట్రంతో కయ్యానికి దిగితే అది తప్పకుండా దిగువనున్న రాష్ట్రాన్ని మరింత ఇబ్బంది పెట్టడం తధ్యం. చట్టాలు, న్యాయస్థానాలు, జల సంఘాలు, కేంద్రం వగైరా ఎన్ని ఉన్నా అవేవీ ఎగువ రాష్ట్రాలను కట్టడి చేయలేవని ఆల్మట్టి, బాబ్లీ డ్యాంల ద్వారా రుజువయింది. ఇప్పుడు తెలంగాణాలో ప్రాజెక్టుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు నష్టపోయేది దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. కనుక ఈ సున్నితమయిన ఈ సమస్యను రాజకీయం చేయకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది.