తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో అన్నీ కలసి వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం టిక్కెట్ దక్కించుకున్నా.. పోటీ చేయలేనని ప్రకటించిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్థానంలో.. టీడీపీ తరపున పోటీ చేయడానికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిద్ధమయ్యారు. బుడ్డా.. నిర్ణయం తెలిసిన వెంటనే ఆయన.. టీడీపీ హైకమాండ్‌తో టచ్‌లోకి వెళ్లారు. పార్టీలో చేరేందుకు తన ఆసక్తిని తెలియచేశారు. నిన్నామొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ లోపే అవకాశం కలసి వచ్చింది. టీడీపీ అధినేత కూడా.. బైరెడ్డికి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందని.. టీడీపీ వర్గాలంటున్నాయి.
బైరెడ్డి.. కర్నూలు జిల్లా టీడీపీలో ఒకప్పుడు కీలక నేత. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేవారు. అయితే రాష్ట్ర విభజన పరిణామాలతో ఆయన పార్టీకి రాజీనామా చేసి ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని ప్రారంభించారు. బస్సుయాత్రలు చేశారు. అయినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. నంద్యాల ఉపఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టారు. కనీస ఓట్లు కూడా రాకపోవడంతో… తన పార్టీ ఆర్పీఎస్ ను రద్దు చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ.. సాధ్యం కాలేదు. టీడీపీ నేతలు పలువురు అభ్యంతరం చెప్పడంతో.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా ఒక్క సీటు అయినా కర్నూలులో వస్తుందని ఆయన అనుకున్నారు. కానీ పొత్తు లేకపోవడంతో… నిరాశకు గురయ్యారు. అదే సమయంలో రఘువీరాతో.. పరిస్థితులు పొసగకపోవడంతో.. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు.
కర్నూలు జిల్లాలో ఇప్పటికే… కోట్ల , కేఈ, గౌరు వర్గాలన్నీ.. టీడీపీ చెంతనే ఉన్నాయి. ఇప్పుడు బైరెడ్డి కూడా చేరితే… దాదాపుగా ప్రధాన వర్గాలన్నీ ఒకే పార్టీలో ఉన్నట్లయితాయి. శ్రీశైలం నియోజకవర్గంలో… గత ఎన్నికల్లో టీడీపీ తరపున శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేశారు. కానీ ఆయన వైసీపీ తరపున రంగంలో ఉన్నారు. ఆయనకు గట్టి పోటీ ఇవ్వాలంటే.. బైరెడ్డి కరెక్టని.. చంద్రబాబు భావిస్తున్నారు. అయితే… ఆయనకు.. ఇతర నేతలతో ఎలాంటి సత్సంబంధాలు లేవు. చంద్రబాబు ఇతర నేతలను ఒప్పించగలిగితే.. బైరెడ్డినే శ్రీశైలంలో టీడీపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది.