రాయలసీమను పధ్నాలుగు జిల్లాలు చేయాలని గతంలో రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కేరళ కంటే విస్తీర్ణంలో రాయలసీమ పెద్దదని ఆయన కారణం చూపిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీలో రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ గా ఉన్న బైరెడ్డి ఇటీవల ఇంటర్యూలు ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న బైరెడ్డి తాజాగా ప్రెస్మీట్ పెట్టి పధ్నాలుగు జిల్లాల రాయలసీమ వాదన వినిపించారు. కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాలను నాలుగు కడప, చిత్తూరు జిల్లాలను మూడు జిల్లాలుగా విభజిచాలన్నారు.
రాయలసీమలోని డోన్, ఆదోని, మదనపల్లె,హిందూపురం తో పాటు మరికొన్ని ముఖ్యమైన పట్టణాలను జిల్లాలుగా చేస్తే ప్రజలకు అన్ని విధాలా బాగుంటుందని బైరెడ్డి చెబుతున్నారు. నాడు ఎన్టీఆర్ మండలాలను ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన చేశారని, కానీ నేడు సిఎం జగన్ దూరంగా ఉన్న మండలాలను దగ్గర జిల్లాలో దగ్గరగా ఉన్న మండలాలను దూరంగా ఉండే జిల్లాలో కలిపి ప్రజలకు దూరపు పాలన అందిస్తున్నారని బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి సెటైర్లు వేస్తున్నారు.
జగన్ పాలన అంతా రివర్స్ లో వెళ్తోందని, అది ఏదోఒక రోజు బోల్తా కొడుతుందంటున్నారు. రాయలసీమలో సియం జగన్ 14 జిల్లాల ఏర్పాటు చేయాలని.. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సీమలో జిల్లాల డిమాండ్లు ఎక్కువగా ఉన్నాయి. బైరెడ్డి వాదనతో ఇంకెవరైనా ఏకీభవిస్తే ఆందోళనలు పెరుగుతాయేమో.. !