కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పడానికి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగా పోరాటానికి సిద్ధపడ్డ దగ్గర్నుంచీ ఆ పార్టీలో మిగులున్న కొద్దిమంది పేరున్న నేతలు కూడా తలోదారి చూసుకుంటున్నారు. ఇదే క్రమంలో కర్నూలు జిల్లాకి చెందిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా కాంగ్రెస్ కి దూరమయ్యారు. ఇప్పుడు అదే జిల్లా నుంచి బైరెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అయితే, బైరెడ్డి రాజీనామాకు కారణం… పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో తలెత్తిన విభేదాలే అని తెలుస్తోంది. విజయవాడలో నిన్న జరిగిన సమావేశంలోనే బైరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారనీ, రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనం కావడానికి కారణం పీసీసీ అధ్యక్షుడి తీరు అంటూ తప్పుబట్టారని సమాచారం.
కర్నూలు డీసీసీ అధ్యక్షుడి పదవిని తన వర్గానికి చెందినవారికి ఇవ్వాలంటూ బైరెడ్డి పట్టుబట్టారట. కానీ, అలీఖాన్ ను నియామకం జరిగిపోయింది. ఈ నిర్ణయంపై బైరెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. నిజానికి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికీ, బైరెడ్డికీ కూడా విభేదాలున్నాయి. అయితే, ఇటీవలే కోట్ల కాంగ్రెస్ కి దూరమయ్యారు. దీంతో జిల్లాలో పార్టీ పగ్గాలు తనకే దక్కుతాయని, అంతా తన చేతుల్లో ఉంటుందని బైరెడ్డి భావించినట్టు సమాచారం. దీన్లో భాగంగానే తన వర్గీయుడికి డీసీసీ అధ్యక్ష పదవి దక్కించుకునే ప్రయత్నం చేశారు. బైరెడ్డి ప్రయత్నాలను కాంగ్రెస్ లోని కొంతమంది అడ్డుకున్నారనీ, ఆ అసంతృప్తితోనే ఇప్పుడు పార్టీకి దూరమౌతున్నారని సమాచారం.
కాంగ్రెస్ నుంచి బయటకి వస్తే… బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏంటనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. నిజానికి, కాంగ్రెస్ లో చేరకముందు ఆయన టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, టీడీపీలో ఆయన చేరికపై అప్పట్లోనే వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తరువాత, కాంగ్రెస్ చేరి… ఈ ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా పోటీ చేసేందుకు బైరెడ్డి సిద్ధంగా ఉన్నట్టు సమచారం. ఇలాంటి సమయంలో పార్టీకి దూరమౌతున్నారు. ఒకవేళ ఇప్పుడు వైకాపాలో చేరినా కూడా టిక్కెట్ దక్కే అవకాశం లేదు. పాణ్యం నుంచి ప్రయత్నించినా… ఇప్పటికే కాటసాని రాంభూపాల్ రెడ్డి టిక్కెట్ ఖరారైంది. టీడీపీలో చేరేందుకు ఇప్పుడు ప్రయత్నించినా… అక్కడ గౌరు కుటుంబం పార్టీలో చేరింది. ఇప్పుడు బైరెడ్డి రాజకీయ ప్రయాణం ఎటు అనేది ప్రశ్నార్థకంగా మారింది.