వైసీపీ యువనేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారని ప్రో వైసీపీ మీడియా అయిన ఎన్టీవీ, టీవీ9లోనే విస్తృతంగా ప్రచారం చేసారు. అయితే ఆయన ఈ వార్తలను ఖండించారు. తాను జగన్ సైనికుడినని ప్రకటించుకున్నారు. అయినా రూమర్స్ మాత్రం సద్దుమణగడం లేదు. దానికి ఆయనే కారణం అవుతున్నారు. శాప్ చైర్మన్గా నామినేటెడ్ పోస్టు పొందిన బైరెడ్డి కొద్ది రోజులు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు అసలు వైసీపీ కార్యక్రమాల్లోనే పాల్గొనడంలేదు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో యువజన వ్యవహారాల శాఖను రోజాకు కేటాయించారు. శాప్ కూడా ఆమె మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తుంది. శాప్ వ్యవహారాలపై తిరుపతిలో సమీక్ష ను రోజా నిర్వహించారు. ఈ సమీక్షలో అంతా తానై వ్యవహరించాల్సిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హాజరు కాలేదు. సిద్దార్థ రెడ్డి ఎందుకు రాలేదన్న అంశంపై ఎవరికీ క్లారిటీ లేదు. అయితే జరుగుతున్న పరిణామాలపై అవగాహన ఉందేమో కానీ రోజా ఈ విషయాన్ని పట్టించుకోకుండానే సమీక్ష ముగించి వెళ్లారు.
తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడబోనని.. మీడియాను పిలిచి మరీ చెబుతున్న ఆయన అదే సమయంలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరం పాటిస్తున్నారు. దీనికి కారణం తన అసంతృప్తిని పార్టీకి తెలియచేయాలనుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంది కొట్కూరు బాధ్యతలను సిద్ధార్థ్ రెడ్డి చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకా ఆర్థర్ ఉన్నారు. ఆయనకు సిద్ధార్ధరెడ్డికి సరిపడటం లేదు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ హైకమాండ్ .. సిద్ధార్థరెడ్డికి హెచ్చరికలు జారీ చేసిందని నియోజకవర్గంలో వేలు పెట్టవద్దని చెప్పిందని తెలుస్తోంది. దీంతో సిద్ధార్థరెడ్డి అసంతృప్తికి గురయ్యారని చెబుతున్నారు.