నందమూరి బాలకృష్ణ నటించిన ‘పరమవీర చక్ర’ గుర్తుంది కదా?? నిజానికి బాలయ్య అభిమానులు మర్చిపోవాలనుకుంటున్న సినిమా ఇది. దాసరి 150వ సినిమాగా వచ్చి.. రికార్డు బ్రేక్ చేస్తుందనుకుంటే.. తన 150 సినిమాల్లోకెల్లా బిగ్గెస్ట్ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు దాసరి. నిర్మాతగా సి.కల్యాణ్ కూడా ఈ సినిమా వల్ల భారీగా నష్టపోయాడు. ఇప్పుడు అదే కల్యాణ్ బాలయ్యతో ‘జై సింహా’ తీశాడు. ఓ ఫ్లాప్ ఇచ్చినా సరే.. బాలయ్య కల్యాణ్‌ని నమ్మాడు. కల్యాణ్ కూడా బాలయ్యపైనే భరోసా పెట్టుకున్నాడు. కాకపోతే… ‘పరమవీరచక్ర’ ఫ్లాప్ అయినా… తనకు ఆత్మ సంతృప్తి ఇచ్చిందనడమే ఇక్కడ కొసమెరుపు.
తన గురువు దాసరి 150వ సినిమాకి తాను నిర్మాత కావడం ఎప్పటికీ మర్చిపోలేను అంటున్నాడు సి.కల్యాణ్. ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా… ఈచిత్రానికి జాతీయ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు సి.కల్యాణ్. సోలోగా రిలీజ్ అయితే మంచి వసూళ్లు వచ్చేవని, గుంపులో రావడం వల్ల మంచి సినిమా నిలబడలేకపోయిందని చెప్పుకొచ్చారు సి.కల్యాణ్. అయితే ఇప్పటికీ ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదు. దాన్ని బట్టి ఆ సినిమా ఎంత డిజాస్టరో అర్థం చేసుకోవొచ్చు. మరి అప్పటి తన అప్పుల్ని ‘జై సింహా’ ఎంత వరకూ తీరుస్తుందో చూడాలి.