నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి బాక్సాఫీసుకి తొడ గొడుతున్నాడు. ‘జై సింహా’ సినిమాతో. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాత. ఈ సినిమాని దర్శక రత్న దాసరి నారాయణరావుకి అంకితమిచ్చింది చిత్రబృందం. దాసరి – బాలయ్యల కాంబోలో ‘పరమవీర చక్ర’ సినిమా రూపొందింది. అది ఫ్లాప్. ఆ తరవాత బాలయ్య – దాసరిలతో ఓ సినిమా చేయాలని కల్యాణ్ భావించేవార్ట. దాసరి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ”గురువు గారూ.. మీరు త్వరగా కోలుకుని రండి.. మీతో బాలయ్యతో ఓ సినిమా చేస్తా” అని కల్యాణ్ చెప్పేవార్ట. ఆ కోరిక తీరలేదు. అందుకే… సి.కల్యాణ్ బాలయ్యతో తీసిన ఈ సినిమాని దాసరికి అంకితం ఇచ్చారు.
* స్పెషల్ గిఫ్టులు
ఈ సినిమాపై సి.కల్యాణ్‌కి రోజు రోజుకీ నమ్మకం పెరిగిపోతోంది. అందుకే.. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ సొంతంగా విడుదల చేస్తున్నారు. విడుదల తరవాత చిత్రబృందానికి ఆయన ప్రత్యేక బహుమతులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ”పారితోషికాలన్నీ అణాపైసలతో ఇచ్చేశా. కానీ… నా చిత్రబృందానికి ఓ ప్రత్యేక బహుమతి ఉంది. సినిమా విడుదలై హిట్టయిన తరవాత ఆ బహుమతుల్ని నేనే అందిస్తా” అన్నారు కల్యాణ్.