తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలలో సి. కళ్యాణ్ ప్యానెల్ విజయం సాధించింది. 12 మంది ఈసీ మెంబర్లలో 9 మంది సభ్యులు సి కళ్యాణ్ నేతృత్వంలోని “మన ప్యానెల్” నుంచి విజయం సాధించారు. దిల్ రాజు సారధ్యంలోని “యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్” నుంచి నలుగురు గెలిచారు. ఇండిపెండెంట్‌గా పోటీచేసిన మోహన్ గౌడ్ గెలుపొందారు. మొత్తం 20 మంది సెక్టార్ మెంబెర్స్లో మొత్తం 16 మంది సి కళ్యాణ్ ప్యానెల్ నుంచి.. నలుగురు దిల్ రాజు ప్యానెల్ నుంచి విజయం సాధించారు. రెగ్యులర్‌గా సినిమాలు తీసే వారికి.. ఫిల్మ్ చాంబర్ అండ చాలా అవసరం. ఫిల్మ్ చాంబర్ లో సభ్యులుగా ఉన్న చాలా మంది సినిమాలు తీయడం లేదు. దీంతో… రెగ్యులర్ గా సినిమాలు తీస్తున్న వారు దిల్ రాజు నేతృత్వంలో “యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్” లో చేరారు.
చాంబర్లో తమ పట్టు ఉండేలా దిల్ రాజు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. మొత్తం 1438 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ కొనసాగుతుండగా ఒకానొక దశలో నిర్మాతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు ప్యానెళ్ల సభ్యులు వాదించుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. టాలీవుడ్లో నిర్మాతల మధ్య చాలా వివాదాలు వచ్చాయి. సినిమా ప్రమోషన్లను కొన్ని చానళ్లకే పరిమితం చేయడం దగ్గర్నుంచి డిజిటల్ ఫ్లాట్‌ఫాంలో సినిమాను ఎప్పుడు ప్రసారం చేయాలన్న దాని వరకూ.. దిల్ రాజు నేతృత్వంలో కొంత మంది సొంత నిర్ణయాలు తీసుకుని అమలు చేసుకుంటున్నారు.
కొద్ది రోజుల క్రితం.. నిర్మాతల మండలికి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లోనూ సి.కల్యాణ్ విజయం సాధించారు. నిజానికి… టాలీవుడ్లో సినిమాలు తీసే నిర్మాతలు తక్కువ మందే. కానీ నిర్మాతల మండలి, చాంబర్లో మాత్రం.. ఇటీవలి కాలంలో సినిమాలు తీయని చాలా మంది సభ్యులుగా ఉన్నారు. ఈ నిర్మాతల మండలి వల్ల.. వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి సినిమాలు తీస్తున్న తమకు.. ప్రయోజనం లేకపోగా.. లేని పోని సమస్యలు వస్తున్నాయని… బడా నిర్మాతలు భావించారు. అందుకే.. సొంత కుంపటి పెట్టుకున్నారు. అందర్నీ ఏకం చేయాలనుకున్న ప్రయత్నాలు మాత్రం విఫలమయ్యాయి.