ఎప్పుడైతే సురేష్ ప్రొడక్షన్స్ చేయి పడిందో.. అప్పుడే కేరాఫ్ కంచరపాలెం వార్తల్లోకి వచ్చింది. ఈ సినిమాని ప్రమోట్ చేసే బాధ్యత రానా తీసుకున్నాడు. సినీ పరిశ్రమలోని దిగ్గజ దర్శకులంతా ఈసినిమాని తెగ మోసేస్తున్నారు. ‘తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’ అంటూ…. ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లని కూడా కొత్తగా చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే… విడుదలకు ముందు ఈ సినిమాని ‘కంచర పాలెం’ ప్రజలకు చూపించాలనుకుంటున్నార్ట. ఈ సినిమా మొత్తం కంచరపాలెం నేపథ్యంలో సాగుతుంది. చిత్రీకరణ కూడా అక్కడే జరిగింది. కంచెర పాలెం గ్రామ ప్రజలే కీలక పాత్రలు పోషించారు. అందుకే ముందు అక్కడి వాళ్లకే ఈ సినిమాని చూపించాలనుకుంటున్నార్ట. ఈ వారంలో కంచెరపాలెంలో స్పెషల్ షో వేయబోతున్నారని సమాచారం. అన్నట్టు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈమధ్య ఓ కొత్త పంథాని ప్రారంభించింది. తమ సంస్థలో రాబోతున్న సినిమాల్ని రామానాయుడు స్డూడియోలోని ప్రివ్యూ థియేటర్లో విడుదలకు ముందే.. ప్రదర్శిస్తుంటారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల్ని అక్కడ విడుదలకు ముందే వందల సార్లు ప్రదర్శించారు. ఆ తరవాత ఫీడ్ బ్యాక్ తీసుకునే విడుదల చేశారు. ఈసారీ అదే పద్ధతి ఫాలో అవుతున్నార్ట. ప్రస్తుతం `కంచరపాలెం` రామానాయుడు స్టూడియోలో ఆడుతూనే ఉంది.