ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భేటీ ప్రభావం ఆంధ్రా కాంగ్రెస్ లో కనిపిస్తోంది! ఈ రెండు పార్టీల పొత్తును వ్యతిరేకిస్తూ… ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నేతలు కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నేత సి. రామచంద్రయ్య కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతి అంతా ఇంతా కాదనీ, ఆయన చేసిన పాపాల్లో తమకు భాగస్వామ్యం ఇస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉన్నపళంగా మెచ్చుకోవాలంటే ఎలా అని ఆయన అన్నారు. రాహుల్, చంద్రబాబు భేటీ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ నేత వట్టి వసంత్ కుమార్ ఆ పార్టీకి ఇప్పటికే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్టుగా ముందుగా తమతో రాహుల్ గాంధీ చర్చించలేదని అంటున్నారు రామచంద్రయ్య. చంద్రబాబుతో పొత్తు విషయమై రాహుల్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామికమైందని ఆయన విమర్శించారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన కిరణ్ కుమార్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకోవడమేంటని కూడా రామచంద్రయ్య ప్రశ్నించారు. ఏపీ కాంగ్రెస్ కి చెందిన మరికొంతమంది సీనియర్ నేతల నుంచి కూడా దాదాపు ఇలాంటి స్పందనే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, ఎప్పట్నుంచో టీడీపీని వ్యతిరేకిస్తున్నవారు ఉన్నారు కదా!
అయితే, ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే… టీడీపీతో పొత్తు పెట్టుకునే ముందు తమతో రాహుల్ గాంధీ చర్చించలేదనీ, తమ అభిప్రాయం తెలుసుకోలేదని కాంగ్రెస్ నేతలు అనడం! ఇదేదో అనూహ్య పరిణామం కాదు కదా! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహా కూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీలు కలుస్తున్నాయన్ని కొన్ని నెలల కిందటే ఫిక్స్ అయిపోయింది. ఆ ప్రక్రియ ఓపక్క జరుగుతున్నప్పుడు… టీడీపీతో పొత్తు గురించి తమకు తెలీదని అంటే ఎలా..? తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయ అవసరాలు వేరు కాబట్టి, దాన్ని ఆ రాష్ట్రానికి పరిమితమైన వ్యవహారంగా చూడాలని కాంగ్రెస్ నేతలే కొంతమంది వ్యాఖ్యానించారు కదా! అప్పుడు కూడా టీడీపీతో పొత్తు తప్పదనే సంకేతాలు వెలువడ్డాయి కదా. ఈ స్పందన ఏదో అప్పుడే ఉండాలి. ఇక్కడ టీడీపీ నుంచిగానీ, కాంగ్రెస్ నుంచిగానీ ఇంకా స్పష్టత లేని విషయం ఏంటంటే… ఈ రెండు పార్టీలూ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేస్తాయా అనేది..? అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి సర్దుబాటూ ఉండదనీ, కేవలం కేంద్రంలో మాత్రమే కాంగ్రెస్ కి టీడీపీ సపోర్ట్ అని టీడీపీ నేతలు అంటున్నారు. ఆచరణలో అది ఎంతవరకూ సాధ్యమనే చర్చ ఇంకా జరగాల్సి ఉంది. కానీ, ఈలోగానే సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్న పరిస్థితి.