కాంగ్రెస్ పార్టీ శాసనమండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ, “రాజధాని కోసం ప్రభుత్వం ఇంకా భూములు సేకరించాలని నిర్ణయించుకొని దాని కోసం కృష్ణా జిల్లాలోని అడవులని డీ నోటిఫై చేయిస్తోంది. వాటికి బదులుగా కడప జిల్లాలో అడవులు పెంచుతామని కేంద్రానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అటువంటి ఆలోచన ఏదైనా చేస్తే అక్కడ రక్తపాతం జరుగుతుంది. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశావిదేశాలు తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్:1 స్థానంలో ఉంది. ఇక్కడ ఇంత అవినీతి పేరుకుపోయుంటే ఎవరు మాత్రం రాష్ట్రానికి రావాలనుకొంటారు? పరిశ్రమలు రావాలంటే పారదర్శకమైన పాలన సాగాలి. ప్రత్యేక హోదా రావాలి. వాటి కోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తే ఏమైనా ఫలితం ఉంటుంది,” అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాలు సేకరించింది. అవన్నీ బంగారం పండే భూములే. ప్రపంచంలో అత్యంత సారవంతమైన, మంచి నీటి వనరులున్న పంట భూములని కాంక్రీట్ ముద్దలతో కప్పెట్టి వాటిపై రాజధాని నిర్మిస్తునందుకే చాలా మంది బాధపడుతున్నారు. అభ్యంతరాలు చెపుతూనే ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి అభ్యంతరాలు ఖాతరు చేయకుండా అక్కడే రాజధాని కట్టడానికి సిద్దం అవుతోంది.
ఆరేడువేల ఎకరాలలో కోర్ క్యాపిటల్ నిర్మిస్తునందున, ప్రభుత్వం చేతిలో ఇంకా కనీసం 26,000 ఎకరాల భూమి మిగిలే ఉంటుంది. ఇంకా రాజధాని కోసం భూమి అవసరమని చెపుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కృష్ణా జిల్లాలో అడవులని కూడా డీ నోటిఫై చేసి వాటిని కూల్చివేసేందుకు సిద్దపడుతోంది. దాని వలన పర్యావరణానికి ఎంత హానీ జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. ఆ అడవులతో బాటే దానిలో నివసించే జీవరాశి కూడా నాశనం అవుతుంది.
రాజధాని కోసం పచ్చటి పంట పొలాలని నాశనం చేసుకోవడమే తప్పనుకొంటే, ఇప్పుడు పచ్చటి అడవులని కూల్చుకోవాలనుకోవడం ఇంకా బాధ కలిగిస్తుంది. ఈ పర్యావరణ వినాశనం ప్రభావం రాష్ట్రంపై చిరకాలం ఉండిపోతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్ట ప్రకారం ఎంత మేర అడవులని తొలగించారో అంత వేరే చోట పెంచవలసి ఉంటుంది. కనుక కడపలో అడవులు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లున్నారు. అయినా ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా వీలైతే అడవులని నాశనం చేయడమే తప్ప పెంచిన దాఖలాలు లేవు. కనుక కృష్ణా జిల్లాలో అడవులు నరికేయడం ఖాయమే కానీ కడపలో పెంచడం మాత్రం ఎన్నటికీ జరుగాకపోవచ్చు. కడపలో అడవులు పెంచుతామంటే రక్తపాతం జరుగుతుందని రామచంద్రయ్య హెచ్చరిస్తున్నారు. ఎందుకో కూడా వివరిస్తే బాగుండేది.