ఈ ఏడాది చివరిలో జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురు గాలి వీస్తోందన్న సర్వేలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న బీజేపీ … అంతులేని అధికార వ్యతిరేకతను మూటగట్టుకుంది. అధికారం చేపట్టి ఐదేళ్లే అయినా… రాజస్థాన్‌లో అంత కంటే ఎక్కువే… ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఇది ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిఫలించింది. ఏబీపీ న్యూస్ – సీ వోటర్ చేసిన సర్వేలో ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని అంచనా వేశారు.
230 అసెంబ్లీ స్థానాలు ఉన్న మధ్య ప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి… 117 స్థానాలు వస్తాయని సర్వే తేల్చింది. చత్తీస్‌గఢ్‌లో 90కి 54 స్థానాలు, రాజస్థాన్‌లో 200కి 130 సాధించి తిరుగులేని విజయం సాధించబోతున్నట్లు తేలింది. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గాలి బాగానే వీస్తున్నా.. మధ్య ప్రదేశ్‌లో మాత్రం.. కొద్దిగానే మొగ్గు కనిపిస్తోంది. రాజస్థాన్‌లో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి 51 శాతం ఓట్లు వస్తాయని.. అశోక్ గెహ్లాట్‌ను సీఎంగా అక్కడి ప్రజలు అత్యధిక మంది కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడయింది. మధ్యప్రదేశ్‌లో 42 శాతం కాంగ్రెస్‌కి 40 శాతం బీజేపీకి మద్దతుగా నిలిచారు. చత్తీస్ గఢ్‌లో 40 శాతం కాంగ్రెస్‌కి 39 శాతం బీజేపీకి మద్దతుగా ఓటేస్తామని చెప్పారు.
ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకంగా మారాయి. సార్వత్రిక ఎన్నికలుక సెమీఫైనల్‌గా అందరూ భావిస్తున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లో గెలిస్తే.. ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా… కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమి కట్టడానికి ముందుకు వస్తాయి. అందుకే ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలు జాతీయ రాజకీయాల్ని మార్చబోతున్నాయి. ఈ పాజిటివ్ వేవ్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎంత మేరకు ఉపయోగించుకుంటారన్నదానిబట్టే ఫలితాలు ఉంటాయి.