ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల మాదిరిగానే ఎంపీలందరికీ ముఫ్పై శాతం మేర జీతాలు కోత విధిస్తూ.. కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రివర్గం మొత్తానికి ఈ వేతన కోత అమలవుతుంది. ప్రధానమంత్రితో పాటు మంత్రులందరి వేతనాలు 30 శాతం తగ్గుతాయి. ఈ మేరకు.. కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆర్డినెన్స్ జారీ చేసి.. తక్షణం జీతాల కోత అమలు చేస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ .. కేబినెట్ భేటీని నిర్వహించారు. వేతనాల్లో కాదు.. మాజీ ఎంపీలకు ఇచ్చే పెన్షన్లలోనూ 30 శాతం కోత పెడుతున్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు అందరికీ ఈ వేతన కోత వర్తిస్తుంది.
ప్రస్తుతం ఎంపీలందరికీ.. నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇస్తున్నారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు .. ఏటా రూ. ఐదు కోట్లు కేటాయిస్తున్నారు. ఉభయసభల ఎంపీలకు ఇవి వచ్చేవి. వారి వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం వీటిని ఖర్చు చేయవచ్చు. వీటిని రెండేళ్ల పాటు.. నిలిపివేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎంపీల వేతనాలు, ఎంపీ ల్యాడ్స్ నిధులు కత్తిరింపు ద్వారా మిగులుతున్న నిధులన్నీ… కరోనాపై పోరు కోసం సిద్ధం చేస్తున్న కన్సాలిడేటెడ్ ఫండ్‌కు వెళ్తాయి. కరోనా పై పోరాటానికే ఈ మొత్తం ఖర్చు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలందరూ.. ఇప్పటికే పెద్ద సంఖ్యలో తమ ఎంపీ ల్యాడ్స్ నిధులను కరోనాపై పోరాటానికి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే అవి గత ఆర్థిక సంవత్సవానివి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచే ప్రారంభమవుతున్నందున… ఈ ఏడాది, వచ్చే ఏడాది ఎంపీ లాడ్స్ నిధులు ఎంపీలకు రావు. వారి జీతాల్లోనూ 30 శాతం కోత పడుతుంది.
ఎంపీల జీతాల్లో కోత ఏడాది పాటు అమల్లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి ఒక్క నెలకే ఈ కోత అమలు చేశారు. తెలంగాణలో 75శాతం.. కోత విధించారు. ప్రస్తుతానికి ఈ ఒక్క నెలకే అయినా… తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ కోత ఉంటుందని తెలంగాణ సర్కార్ ప్రకటించింది. అది ఎంత కాలమో స్పష్టత లేదు. ఏపీ సర్కార్ మాత్రం.. వందకు వంద శాతం.. కోత విధించింది. అవి మళ్లీ ఇస్తారో లేదో చెప్పలేదు. కేంద్రం స్ఫూర్తితో.. ఏడాది పాటో.. రెండేళ్ల పాటో ప్రజాప్రతినిధుల జీతాలకు.. కోత విధించే అవకాశం ఉంది.