ఆంధ్రప్రదేశ్ కేబినెట్.. మూడు రోజుల పాటు ప్రత్యేకంగా జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏడు బిల్లులను ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏడు బిల్లులను కేబినెట్లో ఆమోదించింది. పాలనా వికేంద్రీకరణకు సంబంధించి… హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదిక, సీఆర్డీఏ చట్టం ర్దదు, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధారిటీ ఏర్పాటు వంటి బిల్లులకు అమోద ముద్రవేశారు. అలాగే.. పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నారు. త్వరలో జిల్లాలను విభజించాలని.. నిర్ణయించారు. ఆ తర్వాత సూపర్ కలెక్టర్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. గంట పాటు కేబినెట్ సమావేశం జరగింది.
హైపవర్ కమిటీ నివేదిక ప్రకారం.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను పెట్టాలని నిర్ణయించారు. కర్నూలులో జ్యూడిషియల్ కేపిటల్.. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ ఉంటుంది. మూడు, నాలుగు జిల్లాలకు కలిపి ఓ జోనల్ డెవలప్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తారు. వాటి ద్వారా అభివృద్ది నిధులు కేటాయిస్తారు. సచివాలయం, రాజ్‌భవన్ విశాఖలో ఉంటాయి. అంటే.. ప్రధాన రాజధాని.. వైజాగ్‌గా భావించవచ్చు. సీఆర్డీఏను రద్దు చేస్తున్నందున రాజధాని రైతులకు అదనపు ప్రయోజనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుత ఒప్పందం కంటే రెండు వందలు గజాలు ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే కౌలు పదిహేనేళ్ల పాటు ఇస్తారు. ఈ ప్యాకేజీ నచ్చని రైతులకు.. భూములు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంశంపై టేబుల్ ఐటమ్‌గా చర్చించారు. విచారణను లోకాయుక్తకు అప్పచెప్పాలని కేబినెట్ నిర్ణయించింది.