ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రుల్నితొలగించి కొత్త వారిని తీసుకుంటానని సీఎం జగన్ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచనను మరింత విస్తృత పరుచుని వంద శాతం మార్చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే కొంత మంది మంత్రులకు చెప్పారు. సీఎం జగన్ సమీప బంధువు.. కీలక మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని మీడియాతోనే చెప్పారు. ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన .. త్వరలో తన మంత్రి పదవి పోబోతోందని హింట్ ఇచ్చారు.
వంద శాతం కొత్త మంత్రులను తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారని..విధానపరమైన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తాను సీఎంకు చెప్పినట్లుగా ఆయన తెలిపారు. జగన్ మంత్రులందర్నీ మార్చేయాలని నిర్ణయించుకున్నట్లుగా గతంలోనే మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడదని నిజమయ్యేలా ఉంది. అయితే అత్యంత సీనియర్ మంత్రులు కేబినెట్లో ఉన్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి, బొత్స లాంటి వారిని కదిలించడం.. మంత్రి పదవుల నుంచి తొలగించి వారికి ఇతర పదవులతో సర్దుబాటు చేయడం క్లిష్టమైన విషయమే.
అయితే సీఎం జగన్ రాజకీయంగా చాలా పక్కా వ్యూహంతోనే ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ పార్టీలో ఇబ్బందులు రాకుండా ఆయన రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో సీనియర్లను బుజ్జగిస్తారని చెబుతున్నారు. బాలినేని ప్రకటన కూడా సీనియర్ మంత్రులను మానసికంగా సిద్ధం చేయడానికేనని అంటున్నారు. ఇక నుంచి వరుసగా మంత్రులందరూ తమ తమ అంగీకార ప్రకటనలు మీడియా ద్వారా చేసే అవకాశం ఉంది.