తెలంగాణాలో కేబినేట్ లో మార్పులు చేర్పులు, కొత్త మంత్రులకు స్థానం కల్పించడం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా మారింది. పదే పదే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్ర నేతలను కలిసి వస్తున్న రేవంత్ రెడ్డి… తన కేబినేట్ లో ఎవరికి స్థానం కల్పించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. పాత స్నేహితులతో పాటుగా ప్రస్తుత కాంగ్రెస్ నేతలకు రేవంత్ మంత్రి వర్గంలో స్థానం కల్పించేందుకు కసరత్తులు ముమ్మరం చేసారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై విపక్షాల నుంచి ఎదురు దాడి గట్టిగానే ఉండే అవకాశం ఉంది.
హైడ్రా, మూసి, రైతుల సమస్యలపై బీఆర్ఎస్ దూకుడుగా ఉంది. ఈ సమయంలో కేబినేట్ నుంచి రేవంత్ కు కచ్చితంగా మద్దతు కావాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు రేవంత్ మాత్రమే గట్టిగా మాట్లాడుతున్నారనే భావన కాంగ్రెస్ కార్యకర్తల్లో ఎక్కువగా ఉంది. దీనితో అనుభవంతో పాటుగా వాగ్దాటి ఉన్న నేతలకు కేబినేట్ లో స్థానం కల్పించాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావును కేబినేట్ లోకి తీసుకునే యోచనలో సిఎం ఉన్నట్టుగా సమాచారం. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీలోకి తీసుకునేందుకు అధిష్టానాన్ని కూడా రేవంత్ ఒప్పించారట.
అలాగే యువ నేత బల్మూరి వెంకట్ కు కూడా స్థానం కల్పించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎన్నికల ముందు మంత్రి పదవి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. అలాగే అదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ నేత కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మూసి ప్రాజెక్ట్ విషయంలో తనకు అండగా నిలబడిన… మైనంపల్లి హనుమంతరావును కేబినేట్ లోకి తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. వీరు అందరితో రేవంత్ కు పాత స్నేహం ఉంది.
అలాగే బీఆర్ఎస్ తో వీరికి గట్టి వైరమే ఉంది. ఒక్క మండవకు మినహాయించి. ఆరు మంత్రి పదవులకు అవకాశం ఉండగా ఇద్దరు మంత్రులను కేబినేట్ నుంచి తొలగించే అవకాశం కనపడుతోంది. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేతపై కూడా సిఎం ఆసక్తిగా ఉన్నారని సమాచారం. అయితే ఖమ్మం జిల్లాకు ఇప్పటికే మూడు మంత్రి పదవులు ఉన్నాయి. వీరు అందరి కంటే మండవపైనే రేవంత్ ఎక్కువగా ఫోకస్ చేసినట్టు టాక్. ఆయనను ఖమ్మం ఎంపీగా పంపాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీనితో మంత్రి పదవి ఇవ్వాలని సీఎం పట్టుదలగా ఉన్నారట.