కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్ని భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆశావహులతో గట్టిగా పని చేయించడానికి వాటిని తాయిలాలుగా చూపించాలని ఆ ప్లాన్ అమలు చేశారు. కానీ ఇప్పుడా పధవుల భర్తి అంత తేలికగా అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఒక్క రేవంత్ చాయిస్సే కాదు.. సీనియర్లు కూడా తాము చెప్పిన వారికి పదవులు ఇవ్వాలని హైకమాండ్ వద్దకు సిఫారసులతో వెళ్తున్నారు.
కులాలు, మతాలు, జిల్లాల సమీకరణాలు చూసుకుని రేవంత్ రెడ్డి నాలుగైదు పేర్లతో హైకమాండ్ కు రిపోర్టు ఇచ్చారు. అయితే కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క కూడా కొన్ని పేర్లను ఇచ్చారు. అవన్నీ వేర్వేరుగా ఉండటంతో.. ముందు ఏకాభిప్రాయానికి రావాలని హైకమాండ్ సూచించింది. దీంతో … మంత్రి పదవుల భర్తి ఇప్పటికిప్పుడు లేనట్లేనని గుసగుసలు ప్రారంభమయ్యాయి. రేవంత్ చెప్పిన వారికే మంత్రి పదవులు ఇస్తే… సీనియర్లు అసంతృప్తితో ఉంటారు. భట్టి, కోమటిరెడ్డి చెప్పిన వారికి ఇస్తే సామాజిక, జిల్లాల సమీకరణాలు దెబ్బతింటాయి. ఇలా అనేక సమస్యలు ముంచుకొస్తున్నాయి.
ఇక నామినేటెడ్ పోస్టుల వ్యవహారం తేలడం లేదు. ఎన్నికలకు ముందు కొంత మందికి నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. ఇప్పటికీ జీవో రిలీజ్ చేయలేదు. వాటికే అధికారిక హోదా ఇవ్వకపోతే కొత్తవి ఎప్పుడు భర్తీ చేస్తారోనని కాంగ్రెస్ క్యాడర్ టెన్షన్ పడుతోంది. అధికారంలోకి వచ్చి నెలలు గడిచిపోతున్నాయి కానీ.. కష్టపడిన దానికి ఫలం మాత్రం దక్కడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు ఫీలవుతున్నారు.