మంత్రి వర్గం లేకపోయినా పర్వాలేదని కేసీఆర్ అనుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశం ఇప్పుడల్లా పెట్టాల్సిన అవసరం లేదని ఆలోచిస్తున్నారు. అన్నీ సంక్రాంతి తర్వాతే చేసుకుందామని నిర్ణయించుకున్నారు. శనివారం గంట పాటు గవర్నర్‌తో సమావేశమైన కేసీఆర్.. మంత్రివర్గ విస్తరణ, తన ఢిల్లీ పర్యటనపై చర్చించారు. అలాగే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంపైనా చర్చించారు. సంక్రాంతి తర్వాత అన్ని చేద్దామని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికతోపాటు కేబినెట్ విస్తరణ కూడా సంక్రాంతి తర్వాతే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత కూడా… పరిమితంగానే ఈ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. పాత కొత్తల కలయికగా కూర్పు ఉండే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో విస్తరించాలని కేసీఆర్ ఆలోచనగా ఉంది.
మంత్రులతోపాటు కొందరు పార్లమెంటరీ సెక్రటరీలను కూడా కేసీఆర్ నియమించే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో పద్దెనిమిది మంత్రులకే అవకాశం ఉంది. కేసీఆర్, మహమూద్ అలీకి కాకుండా.. మరో పదహారు మందికిచాన్స్ ఉంది. కానీ ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి వారందరికీ కేబినెట్ హోదాతో పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇవ్వాలనుకుంటున్నారు. గతంలో ఇలాంటి పదవులు ఇచ్చారు. కోర్టు ఆదేశాల కారణంగా వారంతా పదవులు కోల్పోయారు. ఇలా పార్లమెంటరీ సెక్రటరీలుగా ఉన్నందుకు.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు కూడా పడింది. అయినా సరే కేసీఆర్ .. చట్టంలో .. పెట్టుకోవచ్చని ఉందని వాదిస్తున్నారు. నిన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. అందరికీ మంత్రి పదవులు ఇవ్వకుండా.. కొంత మందికి.. పార్లమెంటరీసెక్రటరీ పోస్టులు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికిప్పుడు మంత్రులు, మంత్రివర్గం లేకపోయినా.. వచ్చే నష్టం ఏమీ లేదని కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల విషయంపైనా.. అదే ఆలోచన చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత మంచి ముహూర్తం చూసుకుని ఒకేసారి అన్నింటినీ పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కొసమెరుపేమిటంటే… బడ్జెట్ ను కూడా ఓటాన్ అకౌంట్ పెట్టాలనుకుంటున్నారు. ఎందుకంటే.. లోక్‌సభ ఎన్నికలు ఉన్నందుకన.. కేంద్రం ఓటాన్ అకౌంట్ పెడుతుంది. అందుకే తెలంగాణలోనూ ఓటాన్ అకౌంట్ పెట్టాలేమో.. అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారట. కేంద్ర బడ్జెట్ ఓటాన్ అకౌంట్ పెడితే… తెలంగాణలో పూర్తి బడ్జెట్ పెట్టకూడదా..? ఏమో.. కేసీఆర్‌కే తెలియాలి..!