ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను దాదాపుగా నిర్ణయించేసిన ఏపీ సర్కార్.. ఆ విషయానికి ఆమోద ముద్ర వేయడానికి ఇరవై ఏడో తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. జీఎన్ రావు ఇచ్చిన కమిటీ నివేదిక పై చర్చ జరిపి… ఆమోద ముద్ర వేయనుంది. జీఎన్ రావు కమిటీ ప్రభుత్వ పెద్దల సూచనల మేరకే నివేదిక ఇచ్చినట్లుగా స్పష్టమయింది కనుక.. అందులో మార్పుచేర్పులేమీ ఉండకపోవచ్చని చెబుతున్నారు. అందుకే.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్ణయాన్ని… విశాఖలోనే ప్రకటిస్తే బాగుంటుందనే అంచనాకు వచ్చారు. అందుకే.. ఇరవై ఏడో తేదీన కేబినెట్ సమావేశాన్ని.. సాగరతీరంలో నిర్వహించాలన్న ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే.. కొంత మంది ఉన్నతాధికారులకు ఈ సమాచారం వెళ్లిందని… వారు ఏర్పాట్లు కూడా ఇతర కారణాలు చెప్పి ప్రారంభించారని అంటున్నారు.
ప్రస్తుతం అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క వైసీపీ నేత కూడా అటు వైపు వెళ్లే పరిస్థితి లేదు. మంత్రులు.. గత వారం రోజులుగా.. సచివాలయం వైపు వెళ్లడం లేదు. పటిష్ట భద్రతతో ముఖ్యమంత్రి… ఇడుపులపాయకు వెళ్లారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో… అమరావతి వైపు వెళ్లకపోవడం మంచిదన్న ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మంత్రులు జిల్లాలకే పరిమితమయ్యారు. రాజధానిపై నిర్ణయం తీసుకునేందుకు.. కేబినెట్ భేటీ జరుపుతున్నారు కాబట్టి.. మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని… అందుకే.. కేబినెట్ భేటీలో విశాఖలో నిర్వహించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో అమరావతికి తీవ్ర వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నందున.. అక్కడి నుంచి పాలన సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. అయితే.. విశాఖకు తాత్కాలికంగా అయినా పాలనను మార్చడానికి చాలా క్లిష్టమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగవర్గాలు.. తీవ్ర అసంతృప్తితో ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై.. ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.