తెలంగాణ మంత్రివర్గ ఏర్పాటుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకూ విస్తరణ ఉండదనే సంకేతాలు ఇచ్చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే, ఎన్నికల సమయంలో సిటింగులందరికీ సీట్లు ఇచ్చినట్టుగా… గతంలో మంత్రులుగా ఉన్నవారందరికీ మళ్లీ పదవులు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కుల సమీకరణాలతోపాటు, వీర విధేయులకు పదవులు అనే ప్రచారంలో కూడా ఏమంత వాస్తవం లేనట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఇప్పుడు తెరాసలో రాజకీయమంతా కేటీఆర్ కేంద్రీకృతంగా నెమ్మదిగా మారుతున్న పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే మంత్రి వర్గ కూర్పు ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
గడచిన నాలుగు రోజులుగా తెలంగాణ భవన్ కి మంత్రి పదవులు ఆశిస్తున్నవారి తాకిడే ఎక్కువగా ఉంది. అయితే, వీరంతా కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తూ ఉండటం విశేషం! పార్టీ బాధ్యతలు కేటీఆర్ కి కట్టబెట్టిన దగ్గర్నుంచీ ఆయన చుట్టూనే అందరూ చక్కర్లు కొడుతున్నారు. గతంలో మంత్రి పదవులు నిర్వర్తించినవారితో సహా చాలామంది ఎమ్మెల్యేలు ప్రతీరోజూ కేటీఆర్ ని కలుసుకుని మాట్లాడుతూ ఉన్నారు. అంటే… మంత్రి వర్గ కూర్పులో కేటీఆర్ మార్కు కచ్చితంగా ఉండే పరిస్థితే బయట కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈసారి కేబినెట్ లో వీలైనంత మంది సీనియర్లకు కత్తెర వేసే అవకాశాలున్నాయనీ, అదే కసరత్తు జరుగుతోందన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. మంత్రివర్గంలో యువతకు ప్రాధాన్యత ఉండొచ్చని తెలుస్తోంది. కేటీఆర్ కి అనుకూలంగా ఉండే కేబినెట్ ను ఏర్పాటు చేయాలనేదే ముఖ్యమంత్రి ఆలోచన అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
జాగ్రత్తగా గమనిస్తే… కేసీఆర్ తో పాటు మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా ఎవ్వరికీ అవకాశం ఇవ్వలేదు. చివరికి, రికార్డు స్థాయి మెజారిటీ సాధించిన మేనల్లుడు హరీష్ రావుని కూడా ముందుగా మంత్రిగా తీసుకోలేదు. అందరితో సమానంగానే, అందరితోపాటుగానే ఆయన అనే సంకేతాలు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరించారు. ఎక్కిడికక్కడ ఇవ్వాల్సిన సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. తెరాసలో రెండో పవర్ సెంటర్ కేటీఆర్ అనేది సుస్పష్టం. కాబట్టి, మంత్రి వర్గ కూర్పులో ఆయన ప్రమేయం, ఆయనకి అనుగుణంగా కేసీఆర్ ఆలోచన ఉండటం అనేది కూడా ఉంటుందనేది ఇంకా స్పష్టం!