ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి “సామాజిక న్యాయం” చేసింది. ఆర్టీసీ చైర్మన్, వైస్ చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఇద్దరి పేర్లు ఎ.మల్లికార్జున రెడ్డికి , మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానంద రెడ్డి. సాధారణ పరిపాలన శాఖ గత మే 17 న జారీ చేసిన జి.ఓ.ఎంఎస్.నెం.36 లో పేర్కొన్న విధంగా “ఎస్” కేటగిరీ క్రింద ఈ క్యాబినెట్ హోదాను ఖరారు చేయడం జరిగిందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిజానికి జీవోలేమీ బయటకు రావడం లేదు కనుక.. గత మే పదిహేడో తేదీన ఏ జీవోజారీ చేశారో.. అందులో ఏముందో.. తర్వాతెప్పుడో బయటకు వస్తుంది.
సాధారణంగా కేబినెట్ హోదా ఉండే ఆర్టీసీ చైర్మన్కు మాత్రమే . వైస్ చైర్మన్లకు డైరక్టర్లకు కూడా కేబినెట్ హోదా ఇవ్వడం కాస్త విచిత్రమే. అయితే .. ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన వాళ్లు కావడంతో.. మంత్రి హోదా ఇచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడలేదని తెలుస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం.. వైసీపీ అధినాయకత్వం తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. పదే పదే ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ వైసీపీ పెద్దలు వెనక్కి తగ్గడం లేదు.
ఇప్పటికి కేబినెట్లో ఉన్న మంత్రులు కాకుండా బయటకేబినెట్ హోదా ఇచ్చిన వారి సంఖ్యకు లెక్కే లేదు. సలహాదారుల్లో చాలా మందికి కేబినెట్ హోదా ఉంది. వారందరికీ ప్రజాధనం.. ఇతర అలవెన్స్ లు సిబ్బంది కేటాయించడం వల్ల కనీసం నెలకు ఆరేడు లక్షలు ఖర్చు వస్తుందన్న అంచనా ఉంది. వారంతా ఏం చేస్తారో తెలియదు కానీ.. కేబినెట్ హోదాను మాత్రం అనుభవిస్తున్నారు. ప్రోటోకాల్ పొందుతున్నారు.