కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్య నిన్న తన మంత్రివర్గ ప్రక్షాళన చేశారు. ఒకేసారి 14మంది మంత్రులని తొలగించి, వారి స్థానంలో 13 మందిని కొత్తగా చేర్చుకొన్నారు. వారిలో 9మందికి క్యాబినెట్ హోదా కల్పించగా, మిగిలిన వారికి సహాయమంత్రులుగా నియమించారు. వారందరూ ఆదివారం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణలో మంత్రి పదవులు కోల్పోయినవారు, మంత్రిపదవులు ఆశించి భంగపడినవారు తీవ్ర అసంతృప్తి, ముఖ్యమంత్రి సిద్ద రామయ్యపై తీవ్రఆగ్రహం వెళ్ళగ్రక్కారు. అంతటితో ఆగకుండా వారిలో కొందరు నేరుగా ఆయనని కలిసి లేదా ఫోన్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు తమ అనుచరులతో తమతమ నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు చేయించారు. కొన్ని చోట్ల మంత్రుల అనుచరులు బస్సులు, ప్రైవేట్ వాహనాలు తగులబెట్టి విద్వంసం సృష్టించారు. ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో మొత్తం 31 మంది మంత్రులు ఉండగా వారిలో ఒకేసారి 14మంది మంత్రుల్ని తొలగించడంతో పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరుకొంది. తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం బెంగళూరులో సమావేశం కాబోతున్నారు. వారిలో 8మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి సిద్ద రామయ్య అనేక వివాదాలలో చిక్కుకొన్న కారణంగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనని తొలగించి ఆయన స్థానంలో వేరొకరిని నియమించబోతున్నట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి. కానీ ఆవిధంగా చేస్తే ఆయనే పార్టీని రెండుగా చీల్చే అవకాశం ఉందని సమాచారం అందడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయననే కొనసాగించి, ఆయన సూచన మేరకు ఈ మంత్రివర్గ ప్రక్షాళణకి ఆమోదముద్ర వేసింది. కానీ అది కూడా పార్టీలో తీవ్ర అశాంతికి కారణమయింది. మంత్రివర్గంలో సగం మందిని ఒకేసారి తొలగించి ముఖ్యమంత్రి సిద్ద రామయ్య చేజేతులా సమస్యలని ఆహ్వానించుకొన్నట్లయింది. ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న భాజపా అసంతృప్తి చెందిన కాంగ్రెస్ నేతలని ప్రభుత్వంపై తిరుగుబాటికి ప్రోత్సహించి అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తరహాలో కర్నాటకలో రాజకీయపరిస్థితులను తనకి అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు చేస్తే ఆశ్చర్యమేమీ లేదు.