కొడాలి నానిని ఓడించి తీరాలని టీడీపీ క్యాడర్ అంతా పట్టుబట్టి ప్రయత్నిస్తే.. ఎన్నారై వెనిగండ్ల రాము విజయం సాధించారు. ఆయన కొడాలి నాని వల్ల పడిన బాధలేమీ లేవు. కానీ క్లీన్ ఇమేజ్ .. అని చెప్పి టీడీపీ హైకమాండ్ ఆయనకు చాన్సిచ్చింది. ఆ క్లీన్ ఇమేజ్ పని చేసిందో.. టీడీపీ గాలిలోనో కానీ ఆయన భారీ మెజార్టీతో గెలిచారు. కానీ ఆయన వ్యవహారం మాత్రం టీడీపీ క్యాడర్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. దీనికి కారణం కొడాలి నాని అక్కడ పెత్తనం చేసిన కాలంలో దోచుకున్న వ్యవహారాలను బయటకు తీయడం మానేయడం మాత్రమే కాదు.. కొంత మంది వైసీపీ నేతలను నెత్తిన పెట్టుకోవడం. అందులో తులసీబాబు అనే వ్యక్తి ఒకరు మాత్రమే.
తులసిబాబు అనే వ్యక్తి చోటా రౌడీ. వైసీపీ హయాంలో తప్పుడు పనులు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి. ఐపీఎల్ అధికారి పీవీ సునీల్ కుమార్ తో ఎలా పరిచయం అయిందో కానీ వెనిగండ్ల రాముకు, ఆయనకు మధ్య అనుబంధం ఉందని తాజాగా చెబుతున్నారు. ఆ సునీల్ కుమార్ కు..ఈ తులసిబాబు రైట్ హ్యాండ్. చివరికి తాను సీఐడీ చీఫ్ గా ఉంటే.. లీగల్ అడ్వయిజర్ గా ఈ తులసిబాబును పెట్టుకున్నాడు సునీల్ కుమార్. తర్వాత ఆయనను గుడివాడ ఎమ్మెల్యే వద్దకు పంపారు. అక్కడే ఆఫీసు పెట్టుకుని షాడో ఎమ్మెల్యేగా దందాలు చేస్తున్నాడు తులసిబాబు.
ఆయన గురించి ఏమీ తెలియక పెట్టుకుంటే… వెనిగండ్ల రాము ఆయనను వెంటనే దూరం పెట్టేయాలి. కానీ అంతా తెలిసి కూడా ఆయన ఇంకా.. తులసిబాబు గురించే ఆలోచిస్తున్నారు. జైలు వద్దకు వెళ్లి గంటసేపు మాట్లాడి వచ్చారంటే చిన్న విషయం కాదు. అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాల్లోనూ కేడర్ అంత అసంతృప్తిగా లేరు. వ్యక్తిగత సంబంధాలు ఎలాఉన్నా..రాజకీయాలను రాజకీయంగా చేయకపోతే.. క్యాడర్ నమ్మకం కోల్పోతే ఇక ఫ్యూచర్ ఉండటం కష్టమే అవుతుంది.