కేఫ్ నీలోఫర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్‌లో ఇరానీ చాయ్ అంటే నీలోఫర్‌ను ప్రిఫర్ చేస్తారు అందరూ. అంతటి బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్న నీలోఫర్ ఇప్పుడు గచ్చిబౌలిలో ఓ కొత్త టీ షాప్ పెట్టింది. అది చిన్నది కాదు. చాలా పెద్దది. ఎంత అంటే నెలకు రూ.నలభై లక్షల రూపాయల అద్దె చెల్లించేంత పెద్దది. హైదరాబాద్‌లో మైహోమ్ భూజాకు పక్కనే ఉన్న అద్దాల భవనాన్ని కేఫ్ నీలోఫర్ రెంట్ కు తీసుకుంది. అందుకే టీ కొట్టు పెడుతున్నారు.
కేఫ్ నీలోఫర్ అంటే రెస్టారెంట్ కాదు. టీ దుకాణం మాత్రమే. టీలతో పాటు కొన్ని బేకరీ ఐటమ్స్ అమ్ముతారు. బిర్యానీలు లాంటివి ఉండవు. టీ , కాఫీ,స్నాక్స్ వరకే పరిమితం. అయినా అంత పెద్ద స్థాయిలో రెంట్ కట్టేందుకు సిద్ధపడటం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆ కేఫ్ చాలా లగ్జరీగా ఉంటుందని చెప్పాల్సిన పని లేదు.దానికి తగ్గట్లే రేట్లు కూడా ఉంటాయి. ఈ విషయం పక్కన పెడితే అక్కడ డిమాండ్ కు లోటు ఏమీ ఉండదు. అధిక ఆదాయ వర్గాలు ఉండే ఏరియా అది. ఐటీ ఉద్యోగలు కొన్ని వేల మంది ఉంటారు. రిఫ్రెషింగ్ కోసం వచ్చే వారితో కేఫ్ నీలోఫర్ ఎప్పుడూ బీజీగా ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు. పైగా టీని టెట్రా ప్యాకుల్లో పార్శిల్స్ ఇస్తారు. వీటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది.
కేఫ్ నీలోఫర్ యజమాని పేరు బాబూరావు. ఆయన ఆదిలాబాద్ నుంచి పొట్టచేతపట్టుకుని హైదరాబాద్ వచ్చారు. మొదట బట్టల దుకాణంలో పనిచేశారు. హోటల్లో పనిచేస్తే ఫుడ్ దొరుకుతుందనే కారణంతో.. రోజుకు రెండు రూపాయల కోసం ఒక హోటల్లో పనిచేశారు. తర్వాత కేఫ్ నీలోఫర్ హోటల్లో పనికి చేరారు. నష్టాలలో ఉన్న కేఫ్ నీలోఫర్ యజమాని మూసేయాలనుకున్న సమయంలో బాబూరావు తీసుకున్నారు. బాబూరావునే దీనికి ఓనర్‌గా మారారు. అంచెలంచెలుగా టీ దుకాణాలను కార్పొరేట్ స్థాయికి తీసుకువచ్చారు.