ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నిర్వహణకు అసలు బడ్జెట్‌కు పోలిక లేదని.. శాసనసభను లెక్కలోకి తీసుకోకుండా పద్దులు నిర్వహిస్తున్నారని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ఏపీ ప్రభుత్వంపై మండిపడింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాజ్యాంగ దినోత్సవం రోజున .. బయటకు వచ్చిన ఈ నివేదికలో… ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాల్లోరాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లుగా కాగ్ ఆక్షేపించడం కలకలం రేపుతోంది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులను ఖర్చు చేసి.. తర్వాత జూన్ 2020లో శాసన సభలో ప్రవేశ పెట్టారు.. ఇది రాజ్యాంగ విరుద్దని నివేదిక పేర్కొంది. చట్టసభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీన పరిచారని మండిపడింది. ప్రజా వనరుల వినియోగ నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించారని కాగ్ మండిపడింది. శాసన సభ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పదే పదే ఉన్నాయని నివేదికలో తెలిపింది.
ఇక అదనపు నిధులు అవసరం అని భావిస్తేశాసన సభ నుంచి ముందస్తు ఆమోదం పొందేలా చూసుకోవాలని కాగ్ స్పెష్టం చేసింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వివరాలను బడ్జెట్ పత్రాల్లో సరిగా చూపలేదని కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా వనరుల వినియోగ నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించారని తేల్చేసింది. 2018-19 నాటి రెవెన్యూ లోటును మించి 2019-20లో 90.24 శాతం రెవెన్యూ లోటు పెరిగిందని కాగ్ తేల్చింది. కార్పొరేషన్ల రుణాల గురించిచెప్పకపోవడంతో చాలా వరకూ అప్పుల వివరాలు బయటకు రాలేదని భావిస్తున్నారు.