చంద్రబాబునాయుడు నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచీ పని తక్కువ ప్రచారం ఎక్కువ అనే పాలసీతోనే పాలన సాగిస్తున్నాడు. రాజధాని గొప్పలు, ప్రత్యేక హోదా వేస్ట్, ప్యాకేజీ బెస్ట్ అని ప్రజలను నమ్మించడం కోసం బాబుగారు పడ్డతిప్పలు అన్నీ కూడా ఆయన ప్రచారం ఎపిసోడ్స్‌లో హైలైట్స్‌గా నిలుస్తున్నాయి. కానీ వీటన్నింటికంటే పట్టిసీమ ప్రాజెక్ట్ చుట్టూ చంద్రబాబు నడిపిన ప్రచారం మాత్రం అంతా ఇంతా కాదు.
అవినీతి కోసమే పట్టిసీమ అని ప్రతిపక్ష నేత జగన్ విమర్శించినప్పటి నుంచీ పట్టిసీమ గొప్పదనాన్ని ప్రజలకు చెప్పడం కోసమే చాలా టైం వెచ్చించాడు చంద్రబాబు. బోలెడన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు….అబ్బో పట్టిసీమ ప్రచారంలో బాబుగారు చేపట్టిన ప్రతి ఎపిసోడ్ కూడా హైలైట్‌గా నిలిచింది. నదుల అనుసంధానం అన్నారు, ప్రపంచంలోనే గొప్పది అనే స్థాయిలో మాట్లాడేశారు. ఇంకా ఇంకా చాలా చాలా చెప్పారు. ఇక తాజాగా ఉగాదినాడు పట్టిసీమ పాయసం అంటూ చేసిన పబ్లిసిటీ స్టంట్ అయితే జబర్ధస్త్ కామెడీ ఎపిసోడ్ రేంజ్లో హైలైట్ అయింది. పట్టిసీమతో డెల్టా రైతాంగం మొత్తం ఫుల్ ఖుషీ అయిపోయారని చెప్పాడు చంద్రబాబు. రాయలసీమ రైతులు కూడా అంతే ఆనందంగా ఉన్నారని అంతకుముందు ఎన్నోసార్లు చెప్పారనుకోండి.
కానీ బాబుగారి పట్టిసీమ ప్రచారం మొత్తం ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అయింది. ప్రారంభంలో పట్టిసీమ ప్రాజెక్ట్ గురించి అవినీతి ఆరోపణలు రావడంతో ఇంతటి ప్రచార పర్వానికి తెరతీశారు చంద్రబాబు. లిమ్కా బుక్ అవార్డ్ రాబోతోంది అని కూడా చెప్పుకున్నారు. కానీ కాగ్ రిపోర్ట్ మాత్రం పట్టిసీమ చుట్టూ ఉన్న అవినీతి నిజాలను బయటపెట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులో, వైకాపా నాయకుల విమర్శలో అయితే భజన మీడియాలో కనిపించేవి కాదు గానీ కాగ్ నివేదిక కావడంతో చంద్రబాబు భజన మీడియాలో కూడా పట్టిసీమ అవినీతి వార్తలు ప్రముఖంగా కనిపించాయి. దాంతో చంద్రబాబు ప్రచార కష్టం మొత్తం వేస్టయింది. ఇప్పుడిక పట్టిసీమ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌కి….భారతదేశానికి…ఆ మాటకొస్తే ప్రపంచానికి కూడా ఎంత అవసరమో వివరిస్తూ మరోసారి ప్రచార పర్వాన్ని మొదలెట్టాల్సిందే చంద్రబాబు. అలాగే ప్రపంచంలో ఇప్పటి వరకూ నిర్మించిన ప్రాజెక్టలు అన్నింటికంటే పట్టిసీమ ఎందుకు గొప్పదో చెప్తూ కూడా ప్రచారం చేయాల్సిందే. లేకపోతే పట్టిసీమ ప్రాజెక్ట్ కంటే కూడా ఆ ప్రాజెక్ట్‌లో చోటు చేస్తున్న అవినీతి వ్యవహారాలే జనం మదిలో నిలిచిపోయే అవకాశం ఉంది.