పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపేయాలన్న సూత్రం చాలా కాలంగా అమలులో వుంది. బయిటి ప్రభావాలు లేకుండా ఓటర్లు నిర్ణయం తీసుకోవడానికి ఇది వీలుకల్పిస్తుందన్నది అవగాహన. దీనికి తోడు టీవీలలో సర్వేలు ఒపీనియన్ పోల్స్ వంటివి కూడా ఆపేస్తుంటారు. సోమవారం నాడు ఎబిఎన్‌లో ప్రసారమవుతున్న సర్వేను అర్థంతరంగా ఆపేశారు కూడా. అయితే మంగళవారం కూడా చర్చ జరగలేదా అంటే పరోక్షంగా జరుగుతూనే వుంది. ఉదాహరణకు నేను సాక్షికి వెళితే వైసీపీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి ఇంటిపై పోలీసుల దాడి గురించి వార్తా ప్రసారం వ్యాఖ్యానం నడిచాయి. ఈ వార్త ఈనాడులోనూ ఈ ఉద్రిక్తత గురించిన వార్త కనిపించింది. ప్రచారం గాకుండా జరుగుతున్న ఘటనపై స్పందన గనక దాన్ని ఎవరూ ఆపలేదు. అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో మీడియా గోష్టి పెట్టి ప్రతిపక్ష నేత జగన్‌పై ఘాటు విమర్శలే చేశారు. ప్రసారమైనాయి కూడా.
ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ రోజు పోలింగ్ జరగుతుండగా ఢిల్లీనుంచి ఎన్నికల కమిషన్ జగన్ లోగడ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకుంటూ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అసలు జగన్ లాటి నాయకులను వెంటనే రాష్ట్రం నుంచి పంపేయాలని పిలుపునిచ్చారు. ఇది కూడా మీడియాలో కనిపిస్తున్నది.
ఒకవైపున పోలింగ్ జరుగుతుంటే మరోవైపున ఈ తరహా వ్యాఖ్యలు వార్తలు ప్రసారం చేయడం ప్రభావం చూపదా ఎన్నికల సంఘమే ఆలోచించాలి. వారి ఆదేశాలు కూడా పోలింగ్ ముగిశాక విడుదల చేయొచ్చు కదా! అంటే ఈ ఆంక్షలూ హద్దులూ అన్నీ మిథ్యేనన్న మాట.