తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అసలు ప్రచారం ముగిసింది. ఇప్పటి వరకూ ప్రచారంలో ముందు మేమున్నామంటే.. మేమున్నాని చెప్పుకునేందుకు జన సమీకరణ కోసం భారీగా ఖర్చు చేసిన పార్టీలు.. ఇప్పుడు అసలు యుద్ధం ప్రారంభించాయి. 30వ తారీఖున పోలింగ్ కోసం.. సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఎలక్షనీరింగ్ అత్యంత కీలకం. తమ పార్టీకి చెందిన సానుభూతిపరుల్ని పోలింగ్ కేంద్రాల వరకూ తెచ్చుకోవడం ఇప్పుడు అసలైన పని. పోలింగ్ బూతుల్లో అక్రమాలు జరగకుండా చూసుకోవడమూ కీలకమే.
అదే సమయంలో ఇప్పుడు డబ్బులు పంచనిదే ఎన్నికల్లో గెలుపు ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. గతంలో పల్లెల్లో మాత్రమే పంచేవారు. పట్టణాల్లో పేదల కాలనీల్లో పంచేవారు. ఇప్పుడు కాస్త చదువుకున్న వారు.. కూడా ఓటు వేయాలంటే మాకేంటి అని అడిగే పరిస్థితి వచ్చింది. ఓటు అమ్ముకోవడం అంటే.. దారుణమైన తప్పిదం ఉండదని ఎంతగా ప్రచారం చేస్తున్నా ఎవరూ మారడం లేదు. రాజకీయ పార్టీలు కూడా గెలుపే ముఖ్యమనుకుని ఎంత పంచాలనుకుంటే అంత పంచుతున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఓటు రేటు ఐదు వేలు దాటిపోయింది. రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో అదే ప్రత్యేకత. ఈ సారి తెలంగాణలో డూ ఆర్ డై ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయి. కేసీఆర్ మూడో సారి గెలిస్తే దేశవ్యాప్తంగా ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. జాతీయ రాజకీయాల్లోకి దూసుకెళ్లిపోతారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అద్భుతం అవుతుంది.
ఆ పార్టీకి ఢిల్లీ పీఠం దగ్గరవుతుంది. బీజేపీ ఇప్పటికే ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు.కనీసం హంగ్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అలాంటి చాన్స్ లేదని ప్రజలు ఏదైనా ఏకపక్ష తీర్పు ఇస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటి వరకూ కష్టపడిన పార్టీలు.. 30వ తేదీ వరకూ అసలు యుద్ధం చేయనున్నారు. ఫలితం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయిన తర్వాత ఫలితాల వరకూ టెన్షన్ తో గడుపుతారు. కానీ పోలింగ్ ముగిసిన తర్వాత వారు చేయగలిగిందేమీ ఉండదు కాబట్టి రిలాక్స్ అవుతారు.