తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఇతరుల ఓట్లను పొందడమే కానీ ఇప్పటి వరకూ పొగోట్టుకున్న దాఖలాలు లేవు. అది ఎమ్మెల్యే అయినా.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓట్లయినా సరే. కానీ ఇప్పుడు తమ ఓట్లను కాపాడుకోవడానికి క్యాంపులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో ఆరు స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ జరగనుంది. మగిలినవి ఏకగ్రీవం అయ్యాయి. ఆరింటికి మాత్రమే పోలింగ్ జరుగుతోంది. ఆరు స్థానాల్లో టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ ఉంది.
మొత్తంగా 5,326 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు ఓటర్లుగా ఉంటే.. వీరిలో 70 శాతం టీఆర్ఎస్కు చెందిన వారే. అన్ని స్థానాల్లోనూ ఏకపక్షంగా గెలిచే బలం టీఆర్ఎస్కు ఉంది. అయితే ఖమ్మం, మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థులు, కరీంనగర్, ఆదిలాబాద్లో బీజేపీ పరోక్షంగా బలపరుస్తున్న అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్టీలో అంతర్గత విబేధాలు.. కొంత మంది పక్క చూపులు చూస్తూండటం వంటి కారణాలతో ఓటర్లను ముందస్తుగా క్యాంపులకు తరలించాలని నిర్ణయించారు.
ఇప్పటికే పలు చోట్ల ఓటర్లను తరలించారు. కొంత అనుమానం ఉన్న ఓటర్లను పట్టుబట్టిక్యాంపులకు తరలిస్తున్నారు. అదే సమయంలో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ఇతర పార్టీల ఓట్లకూ గాలం వేస్తున్నారు. ఏకగ్రీవం అవ్వాల్సిన ఎన్నికలను.. ఓటింగ్ దాకా రావడమే కాదు.. ఓట్లను కాపాడుకోవాల్సిన పరిస్థితిలో టీఆర్ఎస్ పడటం.. ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది.