రెండు రోజులుగా పవన్ కల్యాణ్ పై వైసీపీ నేతలు, ఆయన అభిమానుల పేరుతో పోసాని లాంటివారు బూతులుతో విరుచుకుపడుతున్నారు. అయితే పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికపై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. పాలసీ టెర్రరిజం పేరుతో ఆయన కొన్ని విమర్శలుచేస్తున్నారు. పవన్ కల్యాణ్ ట్విట్టర్లో షేర్ చేసిన ఈ క్వశ్చన్ మార్క్ స్నాప్‌షాట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పాలసీ టెర్రరిజాన్ని ఎక్స్ పోజ్ చేసేందుకు పవన్ ఈ విధానాన్ని ఎంచుకున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా చర్చనీయాంశమవుతున్న సమస్యలను ప్రజల ముందు చర్చకు పెట్టారు.
విధానాలన్నీ ఎక్కడివక్కడ అచేనతంగా ఉండిపోయాయన్న విషయాన్ని పాలసీ పెరాలసిస్ అంటారు. అంత కంటే దుర్భరమైన పరిస్థితి ఉండబట్టే పాలసీ టెర్రరిజం అనే పదాన్ని వాడుకలోకి తెచ్చారు. పాలసీటెర్రరిజం, సేవ్ఏపీ ఫ్రం వైఎఎస్ ఆర్ సీపీ పేరుతో సమస్యలను ప్రజల ముందుపెడుతున్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం బ్రాండ్లు, మటన్ షాపులు, అప్పుల ప్రదేశ్, చెత్త పన్ను ఇలా అన్నింటినీ గుర్తు చేస్తున్నారు. అన్నింటికీ హ్యాష్ ట్యాగ్‌గా సేవ్ ఏపీ ఫ్రం వైఎస్ఆర్సీపీ అని పెడుతున్నారు. పాలసీ టెర్రరిజం మాత్రమే కాకుండా ఆలయాలపై దాడుల అంశాన్ని కూడా పవన్ కల్యాణ్ స్నాప్ షాట్‌గా ట్వీట్ చేశారు.
సేవ్ టెంపుల్స్ పేరుతో ఆయన హిందూత్వంపై గత రెండున్నరేళ్ల కాలంలో జరిగిన దాడులు.. ప్రభుత్వం తీసుకున్న హిందూ వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించారు. ఈ ట్వీట్‌ను హిందీలోనూ ఆయన చేశారు. తనపై విరుచుకుపడుతున్న వైసీపీ నేతలకు పవన్ సంప్రదాయంగానే పాలసీ టెర్రరిజం గురించి అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రులు పవన్ లేవనెత్తుతున్న ఇలాంటి అంశాలపై సంప్రదాయంగా రాజకీయ పద్దతిలో సమాధానం చెబితే ప్రజలు హర్షిస్తారు కానీ వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల ప్రజల్లో చులకన అవడం తప్ప మరేమీ ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.