ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు నిరసనల బాట పట్టారు. వారంలో రద్దు చేస్తామన్న సీఎం జగన్ హామీ వారి చెవుల్లో గింగురుమంటోంది. రెండున్నరేళ్లకు ఆ శబ్దం రీసౌండ్లోకి వచ్చింది కానీ హమీ మాత్రం నెరవేరలేదు. అందుకే ఉద్యోగులు రోడ్డెక్కారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ సాధ్యం కాదని పోరాటం ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో రాసుకుపూసుకు తిరుగుతూ స్వప్రయోజనాలు పొందుతున్నారు కానీ ఇప్పటి వరకూ ఉద్యోగుల కోసం తెచ్చి పెట్టిన.. సాధించిన ప్రయోజనం ఏమీ లేదు. రెండేళ్లుగా ఉద్యోగులు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. పీఆర్సీ అమలు చేయకపోయినా, డీఏల పెండింగ్‌లో ఉన్నా, వివిధ రకాల సమస్యలు అపరిష్కృతంగా ఉన్నా ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. కానీ తొలి సారిగా సీపీఎస్ రద్దు కోసం ధర్నాలు ప్రారంభించారు. దీంతో ఒక్క సారిగా ఏపీ ఉద్యోగ వర్గాల్లో ఏం జరుగుతోందన్న చర్చ ప్రారంభమయింది.
సీపీఎస్ పెన్షన్ విధానం రద్దు చేయాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను రాజకీయం చేసి పక్కాగా వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉండగా ఉపయోగించుకున్నారు. ఉద్యోగులతో ఉద్యమాలు చేయించారు. చివరికి చంద్రబాబు ప్రభుత్వం సీపీఎస్ రద్దు మార్గాలను అన్వేషించడానికి టక్కర్ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను జగన్ ప్రభుత్వం పరిశీలించింది. దీని కోసం బుగ్గన నేతృత్వంలో కమిటీని కూడా నియమించారు. ఇది జరిగి రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇంత వరకూ అడుగు ముందుకు పడలేదు. టక్కర్ కమిటీ సీపీఎస్ రద్దు చేయడం లేదా సీపీఎస్ ను కొనసాగించి పాత పెన్షన్ విధానం వల్ల వచ్చే ప్రయోజనాలన్నింటినీ కల్పించడం ఆప్షన్లుగా ఇచ్చింది.
సీఎం జగన్ అన్ని హామీల్ని దిలాసాగా తన క్యాంప్ ఆఫీసులో కూర్చుని సంతకాలు చేయడం ద్వారా లేదా ల్యాప్ ట్యాప్ లో బటన్ నొక్కడం ద్వారా అమలు చేస్తూంటారు. కానీ ఓ కమిటీ నివేదిక ఎదురుగా ఉన్నప్పుడు సీపీఎస్ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. సీపీఎస్ రద్దు అంత తేలికగా అయిపోయే పని అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంత కాలం వేచిచూసేవారు కాదు. ఎప్పుడో ఆ పని పూర్తి చేసే వారు. కానీ సీపీఎస్ రద్దు అంటే చిన్న విషయం కాదని చాలా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయని ఇప్పుడు ప్రభుత్వం వాటిని భరించే పరిస్థితిలో లేదని అంటున్నారు. అందుకే జగన్ ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఆయనా లక్షల కోట్లు అప్పులు చేస్తునన్నందున తమకు ఇచ్చిన హమీలు అమలు చేయడం పెద్ద విషయం కాదని ఉద్యోగులు భావిస్తున్నారు.