ప్రత్యేకహోదా సాధించే విషయంలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో విఫలం అయింది అనే సంగతిని ప్రజలు గుర్తించారు. అధికార పార్టీతో సాధ్యం కాని దానిని తామైనా ఉద్యమాలద్వారా నైనా సాధించుకోవాలని ప్రజలు తమంత తామే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో నేరం తమది కాదు ఆ ముగ్గురిది అంటూ.. వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద నెపం వేసి తప్పించుకోవడానికి తెలుగుదేశానికి చెందిన కేంద్రమంత్రి అశోక్‌గజపతి రాజు ప్రయత్నించడం నవ్వు తెప్పిస్తోంది. ఇందులో కొంతమేర నిజం కూడా ఉండవచ్చు గానీ.. అచ్చంగా ఆ కారణం వలన హోదా అనే ప్రక్రియ మొత్తం ఆగిపోతున్నదన్నట్లుగా మంత్రి మాట్లాడడం విస్తుగొలిపే అంశం. ఏపీకి హోదా ఇవ్వడం గురించి అసలు కేంద్రం పట్టించుకోవడమే లేదని మనం ఏడుస్తోంటే.. తమిళనాడు, బీహార్, కర్నాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడడం వల్లనే రావడం లేదని నమ్మించడానికి అశోక్‌గజపతి ప్రయత్నిస్తున్నారు.
ఆదివారం నాడు విజయవాడలో మాట్లాడుతూ కేంద్రం అన్ని విధాలా రాష్ట్రాన్ని ఆదుకుంటుందనే నమ్మకం తనకున్నదని ఈ కేంద్రమంత్రి హోదాకు సంబంధించి మాత్రం ఇతర రాష్ట్రాలను నిందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మూడు రాష్ట్రాల సీఎంలే మనకు హోదా రాకుండా అడ్డుపడుతున్నారట.
కానీ ఇక్కడ ప్రజలకు కలుగుతున్న సందేహం మరొకటి ఉంది. సాధారణ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటే అన్ని రాష్ట్రాలూ ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఏపీ పరిస్థితి వేరు. ప్రత్యేక పరిస్థితుల్లో అనాథ రాష్ట్రంలా ఏర్పడిన రాష్ట్రానికి లోక్‌సభలో ప్రధాని హామీ మేరకు చట్టంలో భాగంగా ప్రత్యేకహోదా ఇవ్వాల్సి ఉంది. అయినా అడ్డుపడే విషయానికి వస్తే.. అశోక్ గజపతి చెబుతున్న మూడు రాష్ట్రాలూ ఎన్డీయేతర ప్రభుత్వాలే. మోడీ సర్కారుతో తీవ్ర వైషమ్యాలున్న బీహార్ సీఎం నితీశ్, అసలు మోడీని మనిషిగానే ఖాతరు చేసే అలవాటు లేని జయలలిత, ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్‌కు చెందిన సిద్ధరామయ్య అడ్డుపడుతున్నారని.. మిత్రపక్షం పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన ప్రత్యేకహోదాకు గండికొట్టడం అనేది చిత్రంగా కనిపిస్తోంది. మరి ఈ సందేహాలను అశోక్‌గజపతి ఎలా నివృత్తి చేస్తారో?