బెంగాల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. నందిగ్రాం నుంచి ఓడిపోయిన మమతా బెనర్జీ ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంది. అందుకోసం భవానీపూర్ నుంచి గెలిచిన టీఎంసీ ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేశారు. అయితే కరోనా కారణంగా ఎన్నికలు పెట్టబోరన్న ప్రచారం జరిగింది. కానీ బెంగాల్ ప్రభుత్వం పెట్టాల్సిందేనని నివేదిక పంపడంతో ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో మమతా బెనర్జీకి ఓ ముప్పు తప్పినట్లయింది. ఇప్పుడు టీఎంసీని నిలువరించడానికి భవానీపూర్ నుంచి బలమైన అభ్యర్థిని బీజేపీ నిలపెట్టి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది.
టీఎంసీపై ఒత్తిడి పెంచడానికన్నట్లుగా ఇటీవల తృణమూల్ కీలక నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ దంపతులకు ఈడీ నోటీసులు పంపింది. దీనిపై రాజకీయ దుమారం రేగింది. అయితే బీజేపీకి సమాధానం ఇవ్వకపోతే వెనుకబడిపోయామన్న భావనకు వస్తామని చెప్పి..వరుసగా బీజేపీ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకోవడం ప్రారంభించారు. ఇప్పటికి నలుగురు ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. ఎన్నికలకు ముందు బీజేపీ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. బీజేపీ నేతలుగా ఇప్పుడు చెలామణి అవుతున్న వారంతా ఒకప్పుడు టీఎంసీ నేతలే. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిలో అత్యధికులు టీఎంసీ నేతలే. దీంతో వారంతా మళ్లీ దీదీ పార్టీలో చేరాలని ప్రయత్నిస్తున్నారు. సమయం చూసి ఒక్కొక్కరిని చేర్చుకుంటున్నారు.
భవానీపూర్‌లో మమతా బెనర్జీకి మామూలుగా అయితే నల్లేరు మీద నడక కాదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది. గతంలో ఆమె అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. అది ఓ రకంగా తృణమూల్ కంచుకోటే. 2011లో యాభై వేలు వచ్చిన మమతా బెనర్జీ మెజార్టీ 2016లో పాతికవేలకు తగ్గిపోయింది. గత ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థికి 28వేల మెజార్టీ వచ్చింది. అయితే ఈ సారి సీఎం హోదాలో పోటీ చేస్తున్నందున మమతను నిలువరించడం సాధ్యం కాదన్న అభిప్రాయం బీజేపీలోనే వినిపిస్తోంది. అయితే అంత తేలిగ్గా వదిలి పెట్టే అవకాశం లేదని మాత్రం అంచనా వేయవచ్చు.