బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 16 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. కేవలం హైదరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఆ స్థానంలో ఎవర్ని నిలబెట్టినా ఎవరూ పట్టించుకోరు. మరి ఈ పదహారు మందిలో ఎంత మంది గట్టి పోటీ ఇచ్చే వారు అంటే.. ఆ పార్టీ నేతలే ముందూ వెనుకా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వీరిలోనూ రెండు, మూడు సార్లు మార్చి నేతలున్నారు.
ఆదిలాబాద్ – ఆత్రం సక్కు , పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్, నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్,
జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్ , మెదక్ – వెంకట్రామిరెడ్డి, మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ – పద్మారావు గౌడ్, చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ , మహబూబ్ నగర్ – మన్నే శ్రీనివాస్ రెడ్డి, నాగర్ కర్నూల్ – ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి – క్యామ మల్లేష్, వరంగల్ – కడియం కావ్య, మహబూబాబాద్ – మాలోత్ కవిత, ఖమ్మం – నామా నాగేశ్వరరావు పేర్లను ఖరారు చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో వీరిలో ఎవరు గట్టి పోటీ ఇస్తారంటే.. చెప్పలేని పరిస్థితి ఉంది. చివరికి నామా నాగేశ్వరరావు కూడా పోటీ ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు.
చాలా మంది సీనియర్ నేతలు పోటీకి వెనుకడుగు వేయడం.. పార్టీ మారిపోవడంతో ఉన్నంతలో కీలక నేతల్ని అభ్యర్థులుగ ాఖరారు చేశారు. చేవెళ్లకు కాస్త బలమైన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సబిత కుమారుడు కార్తీక్ రెడ్డిని కాదని కాసాని జ్ఞానేశ్వర్ కు సీటిచ్చారు. ఆయన కనీస పోటీ ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. అక్కడ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పరిధిలోని సెగ్మెంట్లలో కనీసం లక్ష మెజార్టీ బీఆర్ఎస్ కు వచ్చింది.
మల్కాజిగిరిలో మొదట శంభీపూర్ రాజు తర్వాత రాగిడి లక్ష్మాెడ్డి.. . నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ , జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్ లకు కేసీఆర్ చాన్సిచ్చారు. ఈ అభ్యర్థిత్వాలను చూసి బీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్‌కు నాగర్ కర్నూలు ఇచ్చారు. మొత్తంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్లమెంట్ సీట్లపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదని.. గులాబీ కార్యకర్తలు ఓ అంచనాకు వస్తున్నారు.