గుజరాత్లో ఐదు అసెంబ్లీ సీట్లను సాధించిన ఆమ్ ఆద్మీకి జాతీయ పార్టీ గుర్తింపు లభించింది. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉంది. గుజరాత్లో ఆరు కన్నా ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకుంది. దీంతో జాతీయ పార్టీ హోదా గుర్తింపు వచ్చేస్తుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలా రాష్ట్రాల్లో ఒక శాతం కన్నా ఎక్కువ ఓట్లు రావడం లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో బలంగా అడుగేస్తోంది. ఈ కారణంగా జాతీయ హోదా వచ్చేసింది.
ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఢీ కొట్టడానికి కాంగ్రెస్ పార్టీకి తోడు జాతీయ పార్టీగా ఆమ్ ఆద్మీ ఉంది. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో మరో జాతీయ పార్టీని పెట్టారు. కానీ ఈసీ పేరు మార్చింది కానీ.. జాతీయ పార్టీగా గుర్తించదు. అలా గుర్తించాలంటే బీఆర్ఎస్ రాజకీయంగా కొన్ని విజయాలు సాధించాల్సి ఉంటుంది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.
ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికి ఈ ఫీట్‌ను సాధించింది. అందుకే జాతీయగుర్తింపు వస్తోంది. కేసీఆర్ ప్రారంభించిన బీఆర్ఎస్ కు కూడా ఇప్పుడు జాతీయ పార్టీ హోదా కీలకం. అందుకే ఆయన ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయాల్సి ఉంటుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయరని తమకు మద్దతిస్తారని జేడీఎస్ ఇప్పటికే ప్రకటించింది. అంటే.. పార్లమెంట్ ఎన్నికల్లోపు ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేసే చాన్స్ లేదని అనుకోవచ్చు. ఏ విధంగా చూసినా ఇప్పుడు .. కేసీఆర్ ఎదుట అతి పెద్ద సవాల్ ఉంది. తేడా వస్తే.. మొదటికే మోసం వస్తుంది.