విలీన మండలాల పర్యటనకు చంద్రబాబు ఖమ్మం మీదుగా వెళ్లి.. భద్రాచలంలో బస చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ మంచి ఆదరణ కనిపించింది. అదే సమయంలో అక్కడి టీడీపీ నేతలు త్వరలో బహిరంగసభ నిర్వహిస్తామని హాజరు కావాలని అడిగినట్లుగా…దానికి చంద్రబాబు అంగీకరించినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గతమెంతో ఘనం. కానీ ఇప్పుడు ఆ పార్టీకి చెందిన అన్ని స్థాయిల నేతలూ వలస పోయారు. గట్టి నాయకత్వం లేకపోవడంతో అభిమానం ఉన్నా ఓట్లు వేసే పరిస్థితి లేదు.
అయితే నమ్మకం కలిగిస్తే బలం పుంజుకునే చాన్స్ ఉంది. కానీ చంద్రబాబు అలాంటి ప్రయత్నాలు చేస్తారా అన్నది సందేహం. ఎందుకంటే… చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ గత రెండు ఎన్నికల్లో సెంటిమెంట్ రేపి విజయం సాధించారన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే ఈ సారి ఆయన కేసీఆర్కు ఆ చాన్స్ ఇవ్వకూడదన్న ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. అయితే చాన్స్ వస్తే పార్టీని రివైవ్ చేయడానికి ఏ మాత్రం సందేహించరని అందుకే తరచూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.
ఏపీ కంటే ముందే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ కారణంగా చంద్రబాబు కాస్త సమయం కేటాయించడానికి చాన్స్ ఉంది. కానీ ఏపీలో గెలవడం.. చంద్రబాబుకు అత్యంత ముఖ్యం. అందుకే పూర్తి సమయంలో ఈ సారి ఏపీకే కేటాయిస్తారని తెలంగాణపై మరీ అంత ఆసక్తి చూపించరన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఈ సారికి మాత్రం పూర్తి స్థాయిలో చంద్రబాబు ఏపీకి పరిమితమవుతారని అంటున్నారు.