ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు రోడ్డెక్కారు. ఆందోళనలు చేశారు. అలాంటి ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసినప్పుడు రెండు విధాలుగా మాట్లాడొచ్చు. ఆ ఉద్యమం చేస్తున్న ప్రజలది న్యాయమైన డిమాండ్. అందరూ కూడా ఆ ప్రజలకు సపోర్ట్ చేయాలి. ప్రభుత్వం దిగిరావాలి అనే విధంగా మాట్లాడొచ్చు. అలాగే ఆ ఉద్యమాన్ని నీరుగార్చేలా కూడా మాట్లాడొచ్చు. ప్రజలు రోడ్డెక్కిన సందర్భంగా ఎంత ట్రాఫిక్ జామ్ అయింది? ప్రజలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన నేపథ్యంలో ధర్నాలు, ఆందోళనలు రాష్ట్ర స్థాయిలో చేయడం వళ్ళ ఉపయోగం ఏంటి?…ఇలా ఎన్ని రకాలుగానైనా నెగిటివ్‌గా మాట్లాడొచ్చు. ప్రత్యేక హోదా ఉద్యమం సమయంలో చంద్రబాబు, పవన్, రాధాకృష్ణ, వెంకయ్యనాయుడులు చేసింది ఇదే. హోదా కోసం రాజకీయ నాయకులు పోరాడతారు…..విద్యార్థులు, యువకులు ఉద్యమాల్లో పాల్గొని భవిష్యత్‌కి నష్టం చేసుకోవాల్సిన అవసరం లేదని పవన్ అన్నాడు. ఇక చంద్రబాబు, వెంకయ్యనాయుడు, ఆంధ్రజ్యోతి ఎం.డి. రాధాకృష్ణలు అయితే పనిగట్టుకుని మరీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చారు. ఉద్యమం చేస్తున్న వాళ్ళ గురించి ఎంత చెడుగా ప్రచారం చేయాలో, ఎన్ని నెగిటివ్ మాటలు మాట్లాడాలో అన్నీ చేశారు. పోలీసు బలగాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించుకుని ప్రత్యేక హోదా ఉద్యమానికి పాతరేశారు. అత్యంత అనుభవజ్ఙుడైన చంద్రబాబు అండ్ టీం మెంబర్స్ అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యావశ్యకమైన ప్రత్యేక హోదా సాధించే విషయంలో రాష్ట్రానికి చేసిన ద్రోహం అది.
చంద్రబాబుతో పోల్చుకుంటే కనీస అనుభవం కూడా లేని, కేంద్ర ప్రభుత్వంతో పరిచయం కూడా లేని, ప్రపంచంలో కాదు కదా….కనీసం తమిళనాడు చుట్టు పక్కల రాష్ట్రాలకు కూడా తెలియని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మాత్రం అద్భుతంగా పనిచేశాడు. జిల్లికట్టు కోసం పోరాటం చేయడం మంచిదా? కాదా? అనే విషయం పక్కన పెడితే తమిళనాడు ప్రజలు ఒక ఆశయం కోసం పోరాడారు. ఆ పోరాటానికి రాష్ట్రంలో ఉన్న అందరు నాయకులు కూడా మద్ధతిచ్చారు. ప్రభుత్వం, పోలీసులు కూడా ఉద్యమాన్ని ఇంకాస్త ఉధృతం చేయడానికే పనిచేశారన్నది వాస్తవం. పేరున్న పెద్ద పెద్దవాళ్ళతో సహా సామాన్యుల వరకూ కూడా జల్లికట్టు ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడినవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. మీడియా కూడా సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. తమిళనాడు రాష్ట్రంతో, తమిళ ప్రజలతో అవసరం ఉన్న ప్రతి ఒక్కరు కూడా జల్లికట్టు ఉద్యమానికి మద్ధతిచ్చేలా చేసుకున్నారు. దట్ ఈజ్ తమిళ్వాడు అని దేశమంతా కూడా వాళ్ళ పట్టుదల గురించి మాట్లాడుకునేలా చేశారు.
జల్లికట్టుతో పోల్చుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఎన్నో రెట్లు ప్రాముఖ్యత ఉన్న అంశం. 2014 ఎన్నికల సమయంలో ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రాణాధారం’ అని చెప్పని నాయకుడు, చెప్పని మీడియా ఏదీ లేదు. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్రావసరాల కంటే మోడీతో స్నేహం, వ్యక్తిగత స్వార్థాలే ముఖ్యమైపోతున్నాయి. తమిళనాడు మీడియా, తమిళ ప్రభుత్వం, తమిళ ప్రజలు, తమిళ్ సెలబ్రిటీస్, తమిళ రాజకీయ పార్టీలు, తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు చూశాక అయినా మన తెలుగు వీరుడు చంద్రబాబు రియలైజ్ అవుతాడేమో చూడాలి. వచ్చే అవకాశమే లేదని ఎందరో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, విశ్లేషకులు తేల్చిపడేసిన తెలంగాణాను కెసీఆర్ తెచ్చుకున్నట్టుగా, జల్లికట్టు కోసం తమిళ్స్ పోరాడినట్టుగా చంద్రబాబు కూడా ముందుకు రావాలి. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా రావడం తథ్యం. అంతకంటే కూడా ఎన్టీఆర్లాగే చంద్రబాబు కూడా తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వితంగా నిలిచిపోవడం ఖాయం.