తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఓ భిన్నమైన పరిస్థితి ఉంది. ఆ పార్టీ సీనియర్లు కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు. జమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీనామా ఎపిసోడ్లో ప్రధానంగా ఇదే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు అనంతపురంలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్మోహమాటంగా టీడీపీ సదస్సులోనే ఈ విషయాన్ని తేల్చేశారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత అప్పటి వరకూ పదవులు అనుభవించిన వారిలో 90 శాతం మంది తమను తాము రక్షించుకోవడానికే సమయం వెచ్చించారు కానీ కార్యకర్తలను పట్టించుకోలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు కొంత మంది సీనియర్ నేతలే వీటిని బహిరంగ పరుస్తున్నారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి నిబద్దతతో దశాబ్దాలుగా సేవ చేస్తున్న వ్యక్తి. ఆయనకు ప్రత్యేకమైన రాజకీయ ప్రయోజనాలు ఉండవు. పార్టీ మేలు కోరుతారు. ఈ కారణంగానే ఆయన నిర్మోహమాటంగా తన అభిప్రాయాలు చెప్పారు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీవ్రమైన వేధింపులు ఎదుర్కొన్న టీడీపీ నేతల్లో ఒకరు. ఆయన పలుమార్లు అరెస్టయ్యారు. ఆయన వ్యాపారాలన్నింటినీ ప్రభుత్వం నిలిపివేయించింది. అయినా సరే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు. ఆయన కూడా పార్టీ పరిస్థితిపై ఇతర నేతల తీరుపై అదే కారణంతో అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు.
అధికార పార్టీకి భయపడి అత్యధిక శాతం టీడీపీ సీనియర్ నేతలు నోరు తెరవని సమయంలో కార్యకర్తల కోసం కష్టనష్టాల కోసం ఎదురు నిలబడిన నేతలు ఇప్పుడు కార్యకర్తలను పట్టించుకోవాలని తెర ముందుకు వస్తున్నారు. కార్యకర్తలను పట్టించుకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల కావడం రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తూండటంతో ఇప్పుడు కొంత మంది టీడీపీ నేతలు హడావుడి ప్రారంభించారు. అదే సీనియర్లలో అసంతృప్తికి కారణం అవుతోంది. పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం దక్కుతోందని గోరంట్ల.. వైసీపీతో కుమ్మక్కయిన వారే పార్టీని నాశనం చేస్తున్నారని జేసీ అంటున్నారు. ఈ అసంతృప్తి స్వరాలను చంద్రబాబు పట్టించుకుంటారో లేదో ఆ పార్టీనేతలే చెప్పలేరు.