దాసరి నారాయణరావు మరణంతో… చిత్రసీమ పెద్ద దిక్కును కోల్పోయింది. ఏ సమస్య వచ్చినా `నేనున్నా` అంటూ ముందుకొచ్చి ఆ సమస్యని పరిష్కరించడంలో దాసరి దిట్ట. ఆయన మాటంటే చిత్రసీమకూ అంత గురి ఉండేది. ఇప్పుడు ఆయన లేరు. కానీ పరిశ్రమ చుట్టూ బోలెడు సమస్యలు పేరుకుపోయాయి. వాటిని చక్కదిద్దే నాధుడు లేక.. టాలీవుడ్లో ఎవరికి తోచిన కామెంట్లు వాళ్లు చేస్తూ… ఆయా సమస్యల్ని మరింత జటిలం చేసేశారు. ఆ దశలో.. చిరంజీవి రంగ ప్రవేశం చేశారు. గడిచిన నాలుగు రోజుల నుంచీ టాలీవుడ్లో విస్క్రృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి. వాటికి నాయత్వం వహిస్తున్నది చిరంజీవే. అగ్ర కథానాయకులు అని చెప్పబడే నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌లతో పోలిస్తే చిరంజీవి చాలా సీరియర్. పైగా ఆయన క్రేజ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఏ విషయంలోనైనా సునిశిత దృష్టి.. లోతైన ఆలోచనా విధానం… ఆయనలో కనిపించే లక్షణాలు. పరిశ్రమలో చాలామందికి చిరంజీవినే ఆదర్శనం. ఆయన అనుచరులు, అభిమానులు ఎక్కువగానే కనిపిస్తారు. పైగా మెగా కాంపౌండ్‌లో ఉన్న హీరోలకు, ఆ కాంపౌండ్ అంటే ఇష్టపడే దర్శకులు, నిర్మాతల సంఖ్యకు లెక్కలేదు. కాబట్టి.. చిరంజీవి `పెద్దరికాన్ని` గౌరవించాల్సిందే. చిత్రసీమ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు చిరంజీవి తానంతట తాను ముందుకొచ్చి.. దారిలో పెట్టాలని చూడడం, అందుకు సంబంధించి ఇలాంటి సమావేశాలు నిర్వహించడం హర్షించదగిన పరిణామమే. ఇప్పటి వరకూ జరిగిన అన్ని సమావేశాలూ.. చిరంజీవి దిశానిర్దేశంలో జరిగినవే. చిరంజీవి సలహాలూ, సూచనలూ బాగానే పనిచేస్తున్నాయన్నది పరిశ్రమ వర్గాల మాట.
నాగార్జున, వెంకటేష్, మహేష్, ఎన్టీఆర్‌లాంటి కథానాయకులకు చిరంజీవి మాటపై గురి ఉంది. వాళ్లెవ్వరూ `నో` చెప్పే ఛాన్స్ లేదు. కాకపోతే.. బాలకృష్ణ చిరంజీవి పెద్దరికాన్ని గౌరవిస్తాడా, లేదా? అనేదే కాస్త ఆసక్తి కలిగించే విషయం. ఇప్పటి వరకూ జరిగిన సినీ సమావేశాలకు ఆయన రాకపోవడం కూడా ఆసక్తి కలిగిస్తోంది. ప్రస్తుతానికి చిత్రసీమకు ఓ నాయకుడు, పెద్ద దిక్కు కావాలి. ఆ బాధ్యత చిరంజీవి తీసుకున్నాడు. చిరు మాటపై నమ్మకంతో.. పరిశ్రమ కూడా ఆయన వెంటే ఉంది. ఫలితాలు ఇప్పటికిప్పుడు వచ్చేస్తాయని ఆశించడం భావ్యం కాదు.కాకపోతే చిరు ఎఫెక్ట్ బలంగానే కనిపించే అవకాశం ఉంది. ఈ సమస్యని చిరు స్మూత్‌గా డీల్ చేయగలిగితే… దాసరి లేని లోటుని చిరు కొంత వరకూ తీర్చగలడన్న భరోసా మాత్రం కలుగుతుంది.