దాసరి నారాయణరావు… దర్శకరత్న – గురువు గారు – సినీ బంధువు – అన్నింటికి మించి పరిశ్రమకు పెద్ద దిక్కు. పరిశ్రమలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆయన దగ్గరకే వెళ్లేవారు. ప్రతీ సమస్యనీ తన భుజాలపై వేసుకుని, పరిష్కారం కోసం పాటుపడేవారు దాసరి. ఆయన ఇల్లు ఓ పంచాయతీ – ఓ మినీ కోర్టు. పరిశ్రమ కష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ముందుండి నడిపించారు. నాయకుడిగా ఎదిగారు. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు అండ, దండలుగా నిలబడిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు దాసరి లేరు. ఆయన మరణం పరిశ్రమను ఎన్నో విధాలుగా కృంగదీసింది. ముఖ్యంగా చిత్రసీమ తన నాయకుడ్ని కోల్పోయినట్టైంది.
అయితే ఇప్పుడు దాసరికి చిరంజీవి రూపంలో ఓ ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. దాసరిలా చొరవ తీసుకుని, అందరినీ కలుపుకుపోయే గుణం, నైజం ఆయనలే దర్శన మిస్తున్నాయి. దాసరిలా చిరులోనూ నాయకుడున్నాడనిపిస్తోంది. ఈ మాట ఎవరో అన్నది కాదు.. స్వయంగా తమ్మారెడ్డి భరద్వాజా అభిప్రాయం ఇది. దాసరి హయాంని ఆయన దగ్గరుండి చూశారు. ఇటు చిరంజీవి స్వభావం గురించీ తెలుసు. తమ్మారెడ్డి – చిరంజీవి ఇద్దరూ మిత్రులే. కాకపోతే.. ఈమధ్య ఇద్దరికీ గ్యాప్ పెరిగింది. చిరంజీవిని తిట్టిపోయడానికి తమ్మారెడ్డి చాలాసార్లు మైకులు పట్టుకున్నాడు. అలాంటి తమ్మారెడ్డినే… దాసరికి ప్రత్యామ్నాయం చిరు అనడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
ఈమధ్య కొన్ని చిన్న సినిమాలకు చిరు ముఖ్య అతిథిగా వచ్చి ఆశీర్వదించాడు. పాత్రికేయుడు పసుపులేటి రామారావు దాసరిపై రాసిన `తెర వెనుక దాసరి` చిరు చేతుల మీదుగానే విడుదలైంది. అంతే కాదు, ఆ ఫంక్షన్ కి అయిన ఖర్చంతా చిరునే భరించి – ఒక్కసారిగా దాసరిని గుర్తు చేసుకునేలా చేశాడు. పరిశ్రమలో అందరినీ కలుపుకుపోయే గుణం.. చిరులో కనిపిస్తోందన్నది తమ్మారెడ్డి మాట. చిరు మెతక స్వభావి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. పైగా దాసరిలా అనుభవజ్ఙుడు. అలాంటి చిరు… దాసరిలా చొరవ తీసుకొని, పరిశ్రమ సమస్యల్ని తన భుజాలపై వేసుకుని నడిపిస్తే, పోరాడితే … అవసరం వచ్చినప్పుడు నాయకత్వం వహిస్తే బాగుంటుందన్నది తమ్మారెడ్డి సూచన. చిరులోనూ ఈ ఆలోచనలు ఉంటే.. దాసరి లేని లోటు తీరినట్టే.